కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇక 17 ఏళ్లు దాటినవారు ఓటరుగా నమోదుకు ఛాన్స్
Election Commission: ఓటు వేయాలనుకునే యూత్‌కు ఇదొక గుడ్ న్యూస్.
Election Commission: ఓటు వేయాలనుకునే యూత్‌కు ఇదొక గుడ్ న్యూస్. యువతీయువకులు తమ ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని అవకాశాలు కల్పించింది. ఇప్పటివరకు 18 ఏళ్లు నిండినవారు మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఇకపై 17 ఏళ్లు దాటినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ సూచించింది. 18 ఏళ్లు పూర్తికాగానే వారికి ఓటు హక్కు లభిస్తుందని స్పష్టం చేసింది.
ఓటు హక్కు నమోదు కోసం ఏటా జనవరి ఒకటి వరకు వేచిచూడాల్సిన అవసరం లేదని ఈసీ పేర్కొంది. ఓటు నమోదు చేసుకునేందుకు అర్హత తేదీ అయిన జనవరి ఒకటితో పాటు ఇక నుంచి ఏప్రిల్ ఒకటి, జులై ఒకటి, అక్టోబర్ ఒకటిని కూడా అర్హత తేదీలుగా గుర్తించాలని ఈసీ తెలిపింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఓటరు జాబితా అప్‌డేట్ అవుతుందని వివరించింది. 17 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు సాంకేతికంగా తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.