అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నాడు. జూన్‌లోపు ఏఐసీసీ కొత్త చీఫ్‌ను ఎన్నుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం సోనియాగాంధీ ఏఐసీసీ తాత్కాలిక సారధిగా వ్యవహరిస్తుండగా మళ్లీ రాహుల్‌గాంధీకే పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు కోరుతున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు త్వరలోనే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభంకానుంది.
99.9శాతం పార్టీ శ్రేణులు రాహుల్‌గాంధీయే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారని గతంలో ఏఐసీసీ మీడియా ఇన్‌ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ కాంగ్రెస్, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఇలా అందరి అభిప్రాయం ఇదేనంటూ రణదీప్ సుర్జేవాలా మీడియా ముఖంగానే తన అభిప్రాయం తెలిపారు. దాంతో, రాహుల్ గాంధీ మళ్లీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టడం దాదాపు లాంఛనం కానుంది. ఇక, రైతు చట్టాలపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.