Michaung Cyclone: మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్‌.. భారీ వర్షాలకు చెన్నైలో 8 మంది మృతి

Michaung Cyclone: పలు ప్రాంతాల్లో మంగళవారం పాఠశాలలు, ఆఫీస్‌లకు సెలవు

Update: 2023-12-05 08:50 GMT

Michaung Cyclone: మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్‌.. భారీ వర్షాలకు చెన్నైలో 8 మంది మృతి

Michaung Cyclone: మిచౌంగ్ తుపాను తమిళనాడును కుదిపేసింది. చెన్నై నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులా మారాయి. కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.

వరదల బీభత్సంతో తీర ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సురక్షిత ప్రాంతాలకు బాధితులను తరలించారు. అన్ని ప్రాంతాలకు సహాయక చర్యలు అందక బాధితులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా నిత్యావసరాలు అందక ప్రజలు అలమటిస్తున్నారు.

అయితే మంగళవారం తెల్లవారు జాము నుంచి చెన్నై నగరంలోని చాలాచోట్ల వర్షం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే తమిళనాడు, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

వర్షాలకు కాస్త తెరపి ఇవ్వడంతో చెన్నై ఎయిర్‌పోర్టులోని రన్‌ వే పై నీటిని అధికారులు తొలగించారు.మంగళవారం ఉదయం విమాన రాకపోకలు పునరుద్ధరించారు. సోమవారం ఉదయం నుంచి చెన్నైలో వర్ష సంబంధిత ఘటనల్లో 8మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలి పలువురు గాయపడ్డారు.

వర్షం తగ్గినా... చెన్నైలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూపమ్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లా్ల్లో విద్యా సంస్థలు , ఆఫీసులకు మంగళవారం సెలవు ప్రకటించారు.

Tags:    

Similar News