National Herald Case: రాహుల్‌గాంధీ విజ్ఞప్తిని అంగీకరించిన ఈడీ
National Herald Case: నేటి విచారణ వాయిదా వేయాలని రాహుల్ విజ్ఞప్తి
National Herald Case: మూడు రోజుల పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విచారించిన ఈడీ అధికారులు ఇవాళ్టి విచారణను వాయిదా వేశారు. తన తల్లి సోనియాగాంధీ ఆరోగ్య కారణాల నేపథ్యంలో తన విచారణ సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ చేసిన విన్నపానికి ఈడీ సానుకూలంగా స్పందించింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గత మూడ్రోజులుగా ప్రశ్నించారు. మొత్తం 28 గంటల పాటు విచారణ జరిపారు. ఇవాళ కూడా విచారణకు హాజరుకావాలంటూ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ ఈడీని కోరుతూ లేఖ రాశారు. తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె ఆసుపత్రిలో ఉందని లేఖలో వివరించారు.
మరోవైపు తమ అగ్రనేత రాహుల్ గాంధీని మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నిస్తుండడం పట్ల కాంగ్రెస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నాయి. ఇవాళ కేంద్ర కార్యాలయాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు తమ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనలు చేపట్టనున్నారు. భయంతోనే రాహుల్‌గాంధీని బీజేపీ టార్గెట్ చేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.