West Bengal: మమతా బెనర్జీకి మళ్లీ ఈసీ నోటీసు
West Bengal: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీకి శుక్రవారం ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
West Bengal: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి శుక్రవారం ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ రెండు రోజుల వ్యవధిలో ఆమెకు అందిన రెండో నోటీసు ఇది. మార్చి 28, ఏప్రిల్ 7న మమత చేసిన ప్రసంగాలను ప్రస్తావిస్తూ..వాటిపై రేపు ఉదయం 11 గంటల కల్లా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
'మహిళలు ఓటు వేయకుండా కేంద్రబలగాలు అడ్డుకుంటున్నాయి. వారికి ఆ అధికారం ఎవరు ఇచ్చారు? 2016, 2019 ఎన్నికలప్పుడు ఇలాంటి పరిస్థితులే కనిపించాయి' అని మమత భాజపాపై విమర్శలు చేశారు. అడ్డుపడిన భద్రతా బలగాలను ఘెరావ్ చేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. అంతేకాకుండా కూచ్‌బిహార్‌లో ఆమె చేసిన ప్రసంగంలో భద్రతాబలగాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైనా ఆ నోటీసుల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే ఈ నోటీసులపై మమత కూడా ఘాటుగానే స్పందించారు. 10 నోటీసులు పంపినా..తన వైఖరిలో మార్పు ఉండదని వ్యాఖ్యానించారు.
మరో వైపు నందిగ్రామ్ బీజెపీ నేత సువేందు అధికారి కి కూడా ఈ రోజు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయంటూ అందిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. దీనిపై 24 గంటల్లోగా స్పందించాలని ఈసీ సువేందును ఆదేశించిన విషయం తెలిసిందే.