మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
*మహారాష్ట్ర - 288 స్థానాలు, హర్యాన - 90 స్థానాలకు ఎన్నికలు *దేశంలోని 51 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు ఎన్నికలు *ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగనున్న ఎన్నికలు *తెలంగాణలో హుజూర్‌నగర్ లో ఉప ఎన్నిక *బీహార్‌లోని సమస్తిపూర్, మహారాష్ట్రలోని సతారా ఉపఎన్నికలు *పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ *21 న ఉదయం 7 గం.లకు పోలింగ్ ప్రారంభం
మహారాష్ట్ర, హర్యాన ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం ప్రారంభం కానున్న ఎన్నికల కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వీటితో పాటు దేశంలోని 51 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. 24 న కౌంటింగ్ జరపనుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగనున్న ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.
దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న మహారాష్ట్ర, హర్యాన ఎన్నికలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మరాఠా యుద్ధంలో.. విజయంపై రెండు కూటములు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. అధికార బీజేపీ, శివసేన కూటమితో ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి తలపడబోతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3 వేల 299 మంది అభ్యర్థులు బరిలో నిల్చారు. 8 కోట్ల 95 లక్షల 62 వేల 706 మంది ఓటేయనున్నారు. ఇందుకోసం 90 వేల 403 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో 122 స్థానాల్లో పాగా వేసిన బీజేపీకి.. రెబల్స్ నుంచి ముప్పు పొంచి ఉంది. 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ నిరాకరించడంతో ఆయా స్థానాల్లో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అలాగే ఈ సారి వర్లీ నుంచి బరిలోకి దిగుతున్న బాల్ ఠాక్రే మనవడు, రాజ్‌ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రేపైనే అందరి ఫోకస్ నిలిచి ఉంది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి.. అధికారపక్షానికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సారి చరిత్ర సృష్టిస్తామని విజయం తమ సొంతం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది.
మరోవైపు హర్యానా వార్ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే జరగనుంది. మొత్తం 90 స్థానాలకు నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో నేషనల్ లోక్‌దళ్, జన్ నాయక్ జనతాపార్టీ, బీఎస్పీ కూడా పోటీ ఇస్తున్నాయి. మొత్తం 11 వందల 68 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 19 వేల 425 పోలింగ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. కోటీ 82 లక్షల 98 వేల 714 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరో 51 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి హుజూర్‌నగర్ లో కూడా ఉప ఎన్నిక జరగనుంది. బీహార్ లోని సమస్తిపూర్, మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్‌ల దగ్గర 144 సెక్షన్ విధించారు. 21 వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. 24 న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.