Driving License: డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ ఇకపై డ్రైవింగ్ స్కూళ్ళలోనే.. జూన్ నుండి కొత్త రూల్స్..!
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ ల కోసం ఇక నుండి ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ ల కోసం ఇక నుండి ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 2024 జూన్ నుండి డ్రైవింగ్ లైసెన్సుల జారీలో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ లో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఫైన్ రూ.25 వేలకు పెంచారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకుండా నిబంధనలు కఠినతరం చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్సులు పొందాలంటే ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్టులో పాసవ్వాలి. అయితే జూన్ 1నుండి ఈ నిబంధనను తొలగించనున్నారు. ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లలో డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తారు. అంతేకాదు, అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ప్రభుత్వం అనుమతులు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్స్ మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది.
1. ప్రైవేట్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు కొత్త రూల్స్
డ్రైవింగ్ శిక్షణ సెంటర్ నిర్వహించే వారు హైస్కూల్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. కనీసం ఐదు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఐటీ సిస్టమ్‌లపై పరిజ్ఞానం అవగాహన ఉండాలి. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కనీసం ఒక్క ఎకరం భూమి ఉండాలి. ఇది ద్విచక్ర వాహనదారులకు లైసెన్స్ ఇవ్వడానికి సరిపోతుంది. నాలుగు చక్రాల వాహనాల డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే సంస్థలకు కనీసం రెండెకరాల భూమి ఉండాలి.
లైట్ మోటార్ వెహికల్స్ కోసం 8 గంటల థియరీ, 21 గంటల ప్రాక్టికల్స్ నిర్వహించాలి. అంటే కనీసం 4 వారాల్లో 29 గంటల పాటు శిక్షణ ఇవ్వాలి. ఇక హెవీ మోటార్ వెహికల్స్ కోసం 8 గంటల థియరీ, 31 గంటల ప్రాక్టికల్స్ నిర్వహించడం తప్పనిసరి.ఆరు వారాల్లో కనీసం 38 గంటలు శిక్షణ ఇవ్వాలి.
2. డ్రైవింగ్ లైసెన్సుల ఫీజులు
లెర్నర్స్ లైసెన్సులు (ఫామ్-3): రూ. 150
లెర్నర్స్ లైసెన్స్ టెస్ట్ (రిపీట్ టెస్ట్): రూ.50
డ్రైవింగ్ టెస్ట్ (రిపీట్ టెస్ట్): రూ.300
డ్రైవింగ్ లైసెన్స్ జారీ: రూ.200
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ :రూ. 1000
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ : రూ.200
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ (లేట్ ఫీజు) రూ.300 + గ్రేస్ పీరియడ్ దాటిన ప్రతి ఏడాదికి రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తారు.
డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ స్ట్రక్షన్ స్కూల్ : రూ. 5000
డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్ మార్పు: రూ. 200
3. మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ. 25 వేల ఫైన్
వాహనాలు నడుపుతూ మైనర్లు పట్టుబడితే రూ. 25 వేల ఫైన్ విధించనున్నారు. పట్టుబడిన మైనర్ల పేరేంట్స్ కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.2 వేలు జరిమానా విధిస్తారు.