మెజారిటీకి దూరంగా ఎన్డీయే.. అసెంబ్లీల్లో విపక్షాల ముందంజ..
Presidential Elections 2022: రాష్ర్టపతి ఎన్నిక దేశ రాజకీయాలను వేడెక్కించాయి.
Presidential Elections 2022: రాష్ర్టపతి ఎన్నిక దేశ రాజకీయాలను వేడెక్కించాయి. అత్యున్నతమైన ఆ పీఠం ఎన్డీఏ పక్షానికి దక్కకుండా అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. అవసరమైన మెజార్టీ కూడగట్టేందుకు అధికార, విపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజార్టీ అధికార ఎన్డీఏకు సొంతంగా లేదు.. కూటమికి కావాల్సిన ఓట్ల సంఖ్య తక్కువే ఉంది. అటు విపక్షాలు ఉమ్మడిగా కలిసి నడిస్తే తప్ప తమ అభ్యర్ధి విజయం సాధించని పరిస్థితి ఉంది. ఎన్డీఏ, యూపీఏ బలాలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
భారత రాష్ర్టపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే వారందరి ఓటు విలువ సమానంగా ఉండదు ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 పాయింట్లుగా ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎమ్మెల్యేల ఓటు విలువ అక్కడి జనాభా ఆధారంగా లెక్కలోకి వస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా, కొన్ని చిన్న రాష్ట్రాల్లో అది 30 కంటే తక్కువగా ఉంది.
2017లో రాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు చాలా మారాయి. ఎన్డీయే 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ లో అధికారం కోల్పోయింది. టీడీపీ, శివసేన, అకాళిదళ్ వంటి మిత్రపక్షాలు ఎన్డీఏకు దూరం అయ్యాయి. ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే ఓట్ల విలువ 48.9 శాతంగా ఉండగా విపక్షాల మొత్తం బలం 51.1శాతం ఉంది. ఎన్నికల్లో గెలవాలంటే ఎన్డీయేకు మరో 1.1 శాతం కంటే కొన్ని ఎక్కువ ఓట్లు అవసరం ఉంది. విపక్షాలు అన్ని ఒక్కటైతేనే తమ అభ్యర్ధి విజయం సాధించగలుగుతారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి ఎన్డీఏ ఎంపీల సంఖ్య 442 ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో వారి బలం 3,12,936 పాయింట్లుగా ఉంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎన్సీపీ, ఆర్జేడీ, డీఎంకేతో స్నేహపూర్వకంగా కలిసి ఉన్న పార్టీలకు కలిపి 136 మంది ఎంపీలు ఉండగా.. వారి ఓట్ల విలువ 96,288 గా ఉంది. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా లేని పార్టీలు బీజేపీకీ మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు. కొందరు ఇండిపెండెంట్ ఎంపీలు సైతం ఉన్నారు. గతంలో బీజేపీకి మద్దతు ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపిండం లేదు.
అసెంబ్లీలో మాత్రం ఎన్డీఏ, ప్రతిపక్షాలదే పై చేయిగా ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో ప్రస్తుతం మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య నాలుగు వేల 33 గా ఉండగా ఎలక్టోరల్ కాలేజీలో వారి ఓట్ల విలువ ఐదు లక్షల 46 వేల 527గా ఉంది. ఎన్డీఏ పాలనలో ఉన్న ఆరు రాష్ర్టాలతో పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్కో శాసనభ్యుడి విలువు 30 పాయింట్లకు తక్కువగా ఉంది. ఇది బీజేపీకి ప్రతికులత అయ్యింది. ఎలక్టోరల్ కాలేజీలో యూపీ అసెంబ్లీ మొత్తం వాటా 83, 824 పాయింట్లు కాగా ఎన్డీఏ బలం 67.7 శాతంగా ఉంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే కూటమి బలం యూపీలో పది వేల పాయింట్లకు పైగా తగ్గింది. ప్రతిపక్షాలు ఎనిమిది పెద్ద రాష్ర్టాల్లో అధికారంలో ఉండటం సానుకూలంగా మారింది.
ఎన్డీఏ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు 11 వేల 990 పాయింట్లు అవసరం ఉంది. మద్దతు కూడకట్టేందుకు కమలనాథులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, టీఆర్ఎస్, బీజేడిల్లో ఒక్క పార్టీ మద్దతు ఇచ్చినా ఎన్డీఏ అభ్యర్ధి రాష్ర్టపతి పీఠంపై కూర్చుంటారు. అయితే ఆయా పార్టీలు అధికారికంగా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
ఎన్డీఏ సపోర్టుతో బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము విజయం సాధించినా విపక్ష పార్టీల కూటమి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా గెలిచినా రాబోయే ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రతిబింబించే అవకాశం ఉందని భావిస్తున్నారు.