Droupadi Murmu: ప్రాథమిక విద్య కూడా కష్టమే అనే గిరిజన పల్లె నుంచి వచ్చాను
జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
Droupadi Murmu: గిరిజన మారుమూల ప్రాంతానికి చెందిన తాను దేశ అత్యున్నత పదవిని అలంకరించడం రాజ్యాంగ ఔన్నత్యమని ప్రెసిడెంట్ ముర్ము అన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకునే శుభ సందర్భంలో ప్రెసిండెంట్ గా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆదివాసీ గ్రామం నుంచి ఈ స్థాయికి వచ్చానన్న ప్రెసిడెంట్ తమ ఊర్లో టెన్త్ క్లాస్ చదువుకున్న మొదటి బాలికను తానేనని తెలిపారు.
రాష్ట్రపతి కావడం కేవలం తన వ్యక్తిగత విజయం కాదన్న ప్రెసిడెంట్ ముర్ము ఇది ఆదివాసీల విజయమని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ దళాలకు, పౌరులందరికీ కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో పేదలు కలలు కనొచ్చని..ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చనేందుకు తన జీవితమే నిదర్శనమన్నారు ముర్ము.
దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరమన్న ప్రెసిడెంట్.. అందుకు తగిన అవకాశాలు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యం, సంప్రదాయాలు తనకు అత్యంత ప్రాధాన్యత అంశాలన్న ముర్ము ప్రజల ప్రేమ, ఆప్యాయత, నమ్మకం రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రోత్సహిస్తాయని చెప్పారు. భారత్ ప్రగతి పథంలో నడుస్తోందని కోవిడ్‌ను ఎదుర్కోవడంలో దేశం ఆదర్శంగా నిలిచిందన్నారు. వచ్చే 25 ఏళ్లలో దేశం పురోగతి సాధించాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకు యువతే నడుం బిగించాలని సూచించారు.