20 సార్లు గర్భం..16సార్లు ప్రసవం.. 11 మంది సంతానం.. డాక్టర్లు షాక్!
ఒక్క కాన్పుకే అమ్మో అనుకుంటారు మహిళలు. కానీ మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ ఏకంగా 20 సార్లు గర్భం దాల్చి.. 17 వ సారి ప్రసవానికి సిద్ధం అయిన విష్యం తెలుసుకున్న డాక్టర్లు షాక్ తిన్నారు.
ఒక్క కాన్పుకే మహిళలకు పునర్జన్మ ఎత్తినట్టుంటుంది. ఒక బిడ్డను కనే సమయంలోనే తాము పడ్డ బాధ ఎవరికీ ఉండకూడదని అంటుంటారు. అటువంటిది ఒకటీ రెండూ కాదు 20 సార్లు గర్భం దాల్చి.. మూడుసార్లు గర్భాన్ని కోల్పోయి.. 17 వ సారి పురిటికి సిద్ధమైన మహిళ గురించి తెలుసుకుంటే, ఆమె ఓపికకు జోహార్లు చెప్పకుండా ఉండలేరు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ఆసుపత్రికి ఓ 38 ఏళ్ల మహిళ ప్రసవం కోసం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్య సిబ్బంది షాకయ్యారు. ఎనుడుకంటే ఆమెకు అది 20 వ గర్భామని తెలిసింది. ఇప్పటివరకూ అన్ని కాన్పుల్లో ఇంట్లోనే జరిగాయి. ఈసారి మాత్రం ఆమె ప్రసవం కోసం ఆసుపత్రికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్‌గావ్ తహనీల్ పరిధిలోని కేశపురి ప్రాంతంలోని సంచార గోపాల్ తెగకు చెందిన మహిళ లంకాబాయి ఖరత్ కు 20 సార్లు గర్భం వచ్చింది. ఇప్పటిదాకా 16 సార్లు ప్రసవం సజావుగా అయిపొయింది. ప్రతి కాన్పులోనూ ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఈ తల్లికి ఐదు సార్లు పుట్టిన బిడ్డలు చనిపోయారు. మొత్తమ్మీద ఇప్పుడు ఆమెకు 11 మంది పిల్లలున్నారు. ఆమెకు మూడుసార్లు మూడునెలల గర్భం ఉన్నపుడు గర్భస్రావం జరిగిందని బీడ్ జిల్లా సివిల్ సర్జన్ డా.ఆశోక్ థొరాట్ చెప్పారు. ప్రస్తుతం ఆమెకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామనీ, తల్లీ, గర్భంలోని బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారనీ ఆమె తెలిపారు.