200 స్థానాల్లో పోటీ చేస్తాం : ఉదయనిధి వ్యాఖ్యలు.. మిత్రపక్షాల మండిపాటు

తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేలో ఏడాది ముందే సీట్ల కలవరం మొదలయింది. డీఎంకే కీలక నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల మిత్రపక్షాలు మండిపడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో డీఎంకే పార్టీ ..

Update: 2020-09-17 01:54 GMT

తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేలో ఏడాది ముందే సీట్ల కలవరం మొదలయింది. డీఎంకే కీలక నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల మిత్రపక్షాలు మండిపడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో డీఎంకే పార్టీ 200 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుందని.. ఇన్ని సీట్లలో పోటీ చేసేలా అధ్యక్షుడు స్టాలిన్ పై ఒత్తిడి తెద్దామని పార్టీ యువజన సమావేశంలో పార్టీ కోశాధికారి టీఆర్‌ బాలు, ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. 2021 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టాలంటే, డీఎంకే అభ్యర్థులు 200 స్థానాల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలను మిత్రపక్షాలు తీవ్రంగానే పరిగణించాయి. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్, మనిదనేయమక్కల్‌ కట్చి అనే పార్టీలు డీఎంకేకు మెగా కూటమిగా ఉన్నాయి.

234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 200 సీట్లలో ఒక్క డీఎంకేనే పోటీ చేస్తే దాదాపు పది పార్టీలకు పెద్దగా సీట్లు ఏమి మిగలవు.. ప్రధాన మిత్రపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 30 కి పైగా సీట్లలో పోటీ చెయ్యాలని భావిస్తోంది. ఇక మిగిలిన పార్టీలకు తలో రెండు వేసుకున్నా దాదాపు 20 వస్తాయి ఈ నేపథ్యంలో డీఎంకే ఏకంగా 200 సీట్లలో పోటీ చేస్తే తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకుండా పోతుందని మిత్రపక్షాలు ఉదయనిధి వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే డీఎంకే వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సంవత్సరాల తరబడి డీఎంకేను నమ్ముకొని ఉన్నందుకు చివరకు ఇలా చేయడం బాగోలేదని కాంగ్రెస్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. సీట్ల సర్దుబాటు వచ్చే ఏడాది జరుగుతుందని.. డీఎంకే చెప్పినన్ని సీట్లలో కాకుండా ఆ పార్టీ ఎక్కువ స్థానాల్లోనే పోటీ చేస్తుందని అన్నారు.  

Tags:    

Similar News