అయోధ్య ఓటర్లు బీజేపీకి నమ్మకద్రోహం చేశారా?
ఫైజాబాద్ లో బీజేపీ ఓటమిపై ఇన్ స్టాగ్రామ్ వేదికగా సునీల్ లాహ్రి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఓటమి చెందడంపై రామాయణం సీరియల్ లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహ్రి నిరాశ చెందారు. ఈ నియోజకవర్గంలోనే అయోధ్య ఉంటుంది. ఫైజాబాద్ లో బీజేపీ అభ్యర్ధి లల్లూసింగ్ పై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధి అవధేష్ ప్రసాద్ 55 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఫైజాబాద్ లో బీజేపీ ఓటమిపై ఇన్ స్టాగ్రామ్ వేదికగా సునీల్ లాహ్రి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బాహుబలిని కట్టప్ప కత్తితో పొడిచే ఫోటోతో ఈ వ్యాఖ్యలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు సునీల్.
అరణ్యవాసం నుండి తిరిగి వచ్చిన సీతాదేవిని అయోధ్యవాసులు అనుమానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టెంట్ నుండి భవ్యమైన ఆలయంలోకి రాముడిని తీసుకువచ్చిన వారిని మోసం చేయకుండా ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. నిజంగా దేవుడు ప్రత్యక్షమైనా వారు తిరస్కరిస్తారని చెప్పారు. అయోధ్య పౌరులు ఎల్లప్పుడూ తమ రాజుకు ద్రోహం చేశారని ఇందుకు చరిత్రే సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఇది వాళ్లకు సిగ్గుచేటని ఆయన అభిప్రాయపడ్డారు.
రామానంద్ సాగర్ నిర్మించిన రామాయణం సీరియల్ లో రాముడి పాత్రలో అరుణ్ గోవిల్, సీతాదేవిగా దీపికా చిక్లియా నటించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణపత్రిష్ట కార్యక్రమంలో వీరంతా పాల్గొన్నారు.