Devendra Fadnavis: దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవంలో ఆసక్తికర పరిణామం
Devendra Fadnavis takes oath as Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు.
ప్రముఖులతో నిండిన ఆజాద్ మైదాన్
ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితీష్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గోవా సీఎం ప్రమోద్ సావంత్, బీహార్ సీఎం నితీష్ కుమార్, చత్తీస్ ఘడ్ సీఎం విష్ణు దేవ్ సాయి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. మహారాష్ట్ర కొత్త సీఎం దేవేంద్ర ఫఢ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లకు వారు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాటామంతి
ఈ సందర్భంగా ఈ వేడుకకు వచ్చిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మాటామంతి కలిపారు. మొదట అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిన ప్రధాని మోదీ, ఆ తరువాత వారితో మాట్లాడుతూ కనిపించడం ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అనధికారిక భేటీని తలపించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిత్యం తమ తమ బిజీ షెడ్యూల్స్‌తో బిజీగా ఉండే ముఖ్యమంత్రులు కూడా ఒకరితో మరొకరు సరదాగా మాట్లాడుకుంటున్న తీరును ఒక ఆసక్తికర పరిణామంగా నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ వేడుక అనంతరం ప్రధాని మోదీ వెంటనే తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు.
సచిన్ టెండుల్కర్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ వంటి ప్రముఖులు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరై వారికి శుభాకాంక్షలు చెప్పారు. వ్యాపార వర్గాల నుండి ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రాధిక అంబానీ, కుమార్ మంగళం బిర్లా వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.