జులై 1న కొలువు దీరనున్న బీజేపీ, ఏక్‌నాథ్ షిండే సర్కార్
సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్
Maharashtra Political Crisis: మహారాష్ర్టలో జులై 1న కొత్తప్రభుత్వం ఏర్పాటు కానున్నది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనున్నది. బీజేపీ-శివసేన తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు రేపు గవర్నర్ ను కలువనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు వేగవంతం చేసింది. పార్టీ కేంద్రపరిశీలకుడిగా సిటీ రవిని బీజేపీ అధిష్టానం ముంబై పంపించింది.
మహారాష్ట్ర సంక్షోభం మెల్లమెల్లగా సర్దుకుంటోంది. శివసేనలో తలెత్తిన రెబల్స్ గొడవ ముదిరి పాకానపడింది. దీంతో ఆ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు మరో కూటమిగా మారారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సీపీలతో కూడిన మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో తాము ఉండబోమని, శివసేన విధానం అయిన హిందూత్వకు ఉద్ధవ్ థాకరే నీళ్లు వదిలారని రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే మండిపడ్డారు. దీంతో ఆయన నేతృత్వంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో గుజరాత్‌లో తొలుత క్యాంపు ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత వీరితో బీజేపీ లీడర్లు చాలామంది భేటీ అయ్యారు. ఇప్పటికే మహారాష్ట్రలో 106 ఎమ్మెల్యే స్థానాలున్న బీజేపీ, శివసేన రెబల్స్ గ్రూపుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉంది. దీనికి కేంద్రంలోని బీజేపీ అగ్ర నేతలు మంత్రాంగం నడిపిన తీరు అంతా బహిరంగ రహస్యమే. అయితే.. ఎట్టకేలకు సీఎం ఉద్ధవ్ థాకరే బుధవారం రాత్రి రాజీనామా చేయడంతో సంక్షోభం కాస్త సద్దుమణిగినట్టు అయ్యింది.
ఇక మహారాష్ట్రలో కాబోయే సీఎం ఎవరు అనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. బీజేపీ రెబల్స్ శివసేన ఎమ్మెల్యేలతో కలిసి ఫడ్నవిస్ సీఎం అవుతారని, ఏక్‌నాథ్ షిండే ఉపముఖ్యమంత్రి అవుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎంగా ఉద్ధవ్ థాకరే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగానే ఇవ్వాల రాత్రి (బుధవారం) బీజేపీ నేతలు స్వీట్లు తినిపించుకుంటూ సంబురాలు జరుపుకున్నారు.