Devendra Fadnavis: మహారాష్ట్రలో ఫలితాలపై కలత చెందిన దేవేంద్ర ఫడ్నవీస్
Devendra Fadnavis: డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న ఫడ్నవీస్
Devendra Fadnavis: సార్వత్రిక ఎన్నికలు మహారాష్ట్ర రాజకీయాలను చర్చాంశంగా మారుస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిని.. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కుదిపేస్తున్నాయి. మహావికాస్ అఘాడీ గణనీయంగా పుంజుకోవడంతో.. ఉపముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనకు ప్రభుత్వ పాలన వద్దని.. పార్టీ బాధ్యతలకే పరిమితం చేయాలని కేంద్ర నాయకత్వాన్ని కోరతానని చెప్పడం కలకలం రేపుతోంది.
మహారాష్ట్రలోని ఎన్డీయే రాజకీయాలు కుదుపుకు గురవుతున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న మహాయుతి పార్టీలను కకావికలం చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుక్కారణం.. అధికారంలో బీజేపీ తరఫున కొనసాగుతున్న ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కలత చెందారు. రావాల్సిన సీట్లు కోల్పోయామని, ఉన్న సీట్లను కూడా రాబట్టుకోలేకపోయామని.. ఇందుకు పార్టీ నాయకుడిగా తాను బాధ్యత వహిస్తున్నానని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని.. ప్రభుత్వ పదవిలో నుంచి తప్పించి పార్టీ బాధ్యతలకే పరిమితం చేయాలని, ఈ బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర నాయకత్వాన్ని కోరుతున్నానని ఫడ్నవీస్ చెప్పారు.
పార్టీ పేలవమైన పర్ఫామెన్స్ కు తాను బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పిన ఫడ్నవీస్.. మహారాష్ట్ర వంటి బీజేపీకి పట్టున్న రాష్ట్రంలో, అది కూడా తాను లీడ్ రోల్ లో ఉన్న సమయంలో సీట్లు తగ్గిపోవడం తాను జీర్ణించుకోలేకపోతున్నానని.. ఈ ఓటమిని తాను అంగీకరించడమే కాక.. అందుకు బాధ్యత కూడా తీసుకుంటున్నానని ప్రకటించారు. తాను పారిపోయేవాడిని కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకున్నాక కొత్త స్ట్రాటజీ రూపొందించుకుంటామన్నారు. స్ట్రాటజీ మీద వర్కవుట్ చేశాక మళ్లీ ప్రజల్లోకి వెళ్తామని.. ప్రజల విశ్వాసం మళ్లీ పొందుతామని వ్యాఖ్యానించారు. అందుకే తనను పార్టీ బాధ్యతలకే పరిమితం చేయాలని కోరతానన్నారు.
ఇక ఈ విషయంపై ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కూడా స్పందించారు. మహారాష్ట్రలో ఓటమికి మహాయుతి ఘట్ బంధన్లోని అందరూ బాధ్యులే అన్నారు. పర్ఫామెన్స్ అంతా కలిసే చేశామని.. ఫెయిల్యూర్ కి కూడా అంతా కలిసి బాధ్యత వహిస్తామన్నారు. దీనిపై తాను ఫడ్నవీస్ ను కలుస్తానని.. ఆయనతో మాట్లాడి సముదాయించేందుకు యత్నిస్తానన్నారు.
మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సింగిల్ లాడ్జెస్ట్ పార్టీగా అవతరించడంతో అది అధికార మహాయుతిలో కలకలం రేపుతోంది. మహాయుతిని దెబ్బతీసిన మహా వికాస్ అఘాడీ.. షిండే శిబిరాన్ని నిరాశపరచింది. 48 సీట్లున్న మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ 29 సీట్లు గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ ఏకంగా 12 సీట్లకు ఎగబాకింది. కాంగ్రెస్ కు 2014లో 2 సీట్లు మాత్రమే ఉండేవి. 2019లో ఒక్క సీటుకే పరిమితమైంది. ఈసారి మాత్రం 12 సీట్లు గెల్చుకొని బీజేపీ నేతలను పరేషాన్ చేసింది. శివసేన (యూబీటీ) 10 సీట్లు, ఎన్సీపీ-శరద్ పవార్ 7 సీట్లు గెలుచుకున్నారు. ఇక బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి 18 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 11 సీట్లు, శివసేన 6 సీట్లు, ఎన్సీపీ 1 సీటు మాత్రమే గెలుచుకున్నాయి. కాంగ్రెస్ రెబల్ గా ఉండి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన విశాల్ పి.పాటిల్ సాంగ్లీలో గెలిచాడు.
ఫలితాలు తారుమారైన మహారాష్ట్రలో ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం కలకలం రేపుతోంది. అయితే ఫడ్నవీస్ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించడమే గాక.. తనను పార్టీకే పరిమితం చేయాలని కోరతానని చెప్పడం.. ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయా అనే అనుమానాలకు తావిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సీఎం, డిప్యూటీ సీఎం మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని.. శివసేన, బీజేపీ, ఎన్సీపీ సంకీర్ణ సర్కారు అద్భుతంగా నడుస్తుందని అంతా చెప్పుకుంటున్న క్రమంలో.. ఫలితాలు దెబ్బతీయడం.. మహాయుతిలో కనిపించకుండా ఉన్న లుకలుకలను బయటి ప్రపంచానికి తెలిసేలా చేస్తుందన్న అభిప్రాయాలకు తావిస్తోంది. ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టే పర్ఫామెన్స్ దెబ్బ తిందని ఫడ్నవీస్ చెప్పదలచుకున్నారా.. అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఫడ్నవీస్ రిజిగ్నేషన్ టీ కప్పులో తుఫానులా తేలిపోతుందా.. లేక దీని పర్యవసానాలు మరిన్ని బయట పడతాయా అన్న ఆసక్తి సర్వత్రా వినిపిస్తోంది.