మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై శివసేన సినీయర్ నేత ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్ చిన్న పిల్లల మాదిరి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని ఆయన వ్యాఖ్యానించారని, ఇప్పుడు బీజేపీనే ప్రతిపక్షంలో ఉందని ఎద్దేవా చేశారు. శివసేన పత్రిక సామ్నాలో సంజయ్ రౌత్ పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ఉద్దవ్ ఠాక్రే సీఎంగా మహారాష్ట్రతో స్వాగతించిందని వెల్లడించారు.
దేశంలో మోదీ, అమిత్ షా ను ఎదుర్కొని మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన కూడిన మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు శరద్ పవార్ సహకరించారని ఆయన చొరవతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగామని స్పష్టం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం లోని మహా వికాస్ ఆఘాడి బల పరీక్షలో నెగ్గింది. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 169 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.