Delta Plus: భారత్‌లో ఆందోళన కలిగిస్తోన్న డెల్టా ప్లస్ వేరియంట్

Delta Plus: ప్రపంచవ్యాప్తంగా ప్రాబల్య స్ట్రెయిన్‌గా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

Update: 2021-07-02 03:38 GMT

Representational Image

Delta Plus: కరోనా సెకండ్ వేవ్‌ నుంచి బయటపడే లోపే భారత్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డెల్టా వేరియంట్‌ 96 దేశాలకు విస్తరించిందని.. మున్ముందు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాబల్య స్ట్రెయిన్‌గా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. 96 దేశాలు డెల్టా వేరియంట్‌ కేసులను రిపోర్ట్‌ చేశాయి. వాటిలో చాలా దేశాల్లో ఈ వేరియంట్‌ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్ల బారిన పడి, ఆస్పత్రి పాలైన కేసులు ఉన్నాయి.

ఆందోళనకారక వేరియంట్ల వ్యాప్తి వేగం ఎక్కువ కాబట్టి కొవిడ్‌ నిబంధనలను ఎక్కువ కాలం పాటించాల్సి వస్తుందని.. వ్యాక్సినేషన్‌ వేగం తక్కువగా ఉన్న దేశాలు త్వరపడి, ఆ దిశగా లక్ష్యాలను రూపొందించుకుని, నిర్ణీత సమయంలో టీకాలు వేయాలని సూచించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. ఆల్ఫా (బ్రిటన్‌) వేరియంట్‌ 172 దేశాల్లో, బీటా (దక్షిణాఫ్రికా) వేరియంట్‌ 120 దేశాల్లో, బ్రెజిల్‌ వేరియంట్‌ 72 దేశాల్లో ఉన్నాయి. కాగా.. ప్రపంచంలోని ప్రతి దేశమూ సెప్టెంబరుకల్లా తమ జనాభాలో 10 మందికి, డిసెంబరుకల్లా 40 మందికి కొవిడ్‌ టీకాలు వేయాల్సిందిగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ సూచించారు.

కరోనాను సమర్థంగా కట్టడి చేసే అత్యుత్తమ మార్గం అన్ని దేశాలూ సమానంగా టీకాలు వేయడమేనని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను ప్రస్తుతానికి ఆందోళనకారకంగా పరిగణించట్లేదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ ప్రకటించారు. డెల్టా ప్లస్‌ కేసులు ప్రస్తుతానికి తక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఇక, కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతిపై ఆగస్టు రెండో వారంలో ఒక నిర్ణయం వెలువడొచ్చన్నారు. 

Tags:    

Similar News