N440K Strain: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీలో నో ఎంట్రీ

N440K Strain: వైరస్‌లో మార్పులు వచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

Update: 2021-05-07 05:08 GMT

సీఎం కేజ్రీవాల్:(ఫైల్ ఇమేజ్)

N440K Strain: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఢిల్లీ వచ్చే ప్రయాణీకుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసి షాకిచ్చింది. ఆ రెండు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తే 14 రోజుల పాటు సంస్థాగత క్వారెంటైన్‌లో ఉండాలని గురువారం స్పష్టం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోని వైరస్‌లో మార్పులు వచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

దక్షిణాది రాష్ట్రాలల్లో ఎన్‌440కే మ్యుటెంట్‌ ఉనికిని ఉందని, ఇది అత్యంత ప్రమాదికారని ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. గత రెండు మూడు రోజులుగా జాతీయస్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. విమానాలు, రైళ్లు, బస్సులు, కార్లు, ట్రక్కులు సహా ఇతర ఏ రవాణా మార్గాల్లో ఢిల్లీకి వచ్చినా క్వారెంటైన్‌లో ఉండాలి.. అందుకయ్యే ఖర్చును వారే భరించాలి. రెండు డోసుల టీకా వేయించుకున్నా, ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్ష చేయించుకున్న తర్వాత నెగెటివ్‌ వచ్చినా... సంబంధిత పత్రాలను కలిగి ఉన్నవారు వారం రోజుపాటు హోం క్వారెంటైన్‌లో ఉండాలి'అని వివరించింది.

కొత్తరకం స్ట్రెయిన్ వ్యాప్తితో పొరుగున్న ఉన్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. ఏపీ సమీపంలోని సుక్మా జిల్లా సరిహద్దులను మూసివేసింది. అలాగే ఒడిశా సైతం ఏపీ, తెలంగాణతో సరిహద్దులను పూర్తిగా మూసేసి, కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎవరైనా ఒడిశాలోకి వస్తే కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ వైరస్ ముప్పులేదని చెబుతోంది. గతేడాది జూన్‌-జులై మధ్యలో దీనిని గుర్తించామని, డిసెంబరు, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉద్ధృతంగా వ్యాపించి, మార్చిలో గణనీయంగా తగ్గిందని తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పాజిటివ్‌ కేసులు కనిష్ఠ స్థాయిలోనే ఉన్నాయంది. ప్రస్తుతం సేకరించిన నమూనాలు విశ్లేషించినప్పుడు వాటిల్లో బీ.1.617, బీ1 మ్యుటేషన్లు అధికంగా ఉన్నట్లు తేలిందని పేర్కొంది.

రాజ్యాంగ పదవుల్లో ఉండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారు, వారి సిబ్బందికి కరోనా లక్షణాలు లేకపోతే ఈ షరతుల నుంచి మినహాయింపు ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి వ్యాప్తి చెందినట్లుగా భావిస్తోన్న ఎన్440కే రకం వేరియంట్ సాధారణ స్ట్రెయిన్ కంటే 15 రెట్లు ప్రాణాంతకమైందని అధికారులు సమర్పించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News