Lockdown: ముందు జాగ్రత్తగా అలెర్ట్ అయిన మందు బాబులు
Lockdown: ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. లాక్ డౌన్ విధించారు. కానీ తాగుబోతులు మాత్రం మందు కోసం క్యూకట్టారు.
Lockdown: ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. లాక్ డౌన్ విధించారు. కానీ తాగుబోతులు మాత్రం మందు కోసం క్యూకట్టారు. కరోనాతో జనం చస్తుంటే వీళ్లకు మాత్రం మందు కావాల్సి వచ్చింది. వారం రోజులు లాక్‌డౌన్ ప్రకటనతో మద్యం షాపుల ముందు వాలిపోయారు. కరోనాతో దేశం అట్టుడికిపోతుంటే వీరు మాత్రం ఒక రేంజ్ లో అలెర్ట్ అయిపోయారు. రాత్రి 10 గంటల నుంచి ఢిల్లీలో కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఇంకేముంది మద్యంప్రియులు పరుగు పరుగున వైన్‌షాపుల ముందు వాలిపోయారు. మద్యం బాటిళ్ల కోసం ఎగబడుతున్నారు. నచ్చిన బ్రాండ్స్ పక్కన పెట్టి ఏది దొరికితే అది చంకన పెట్టుకొని వెళ్తున్నారు. ఢిల్లీలో ఏ వైన్స్ చూసినా ఏ బార్‌ను చూసినా జనాలతో కళకళలాడుతున్నాయి.
గత లాక్‌డౌన్ నేర్పిన పాఠం అనుకుంటా మందుబాబులు ముందుజాగ్రత్త పడుతున్నారు. ఎలాగైనా వారానికి సరిపడా మందు తెచ్చుకోవాలని వైన్స్ షాపుల వద్దకు చేరుకున్నారు. వాళ్ల ముందు చూపు బాగానే ఉంది. కానీ కరోనా రూల్స్‌ని గాలికి వదిలేశారు. సోషల్ డిస్టెన్స్‌ను పాతర వేశారు. క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. ఒకరినొకరు హత్తుకున్నట్లే నిలబడిపోయారు. ఇక కరోనా కామ్‌గా ఉంటుందా దొరికినవారిని దొరికినట్లు టచ్ చేసే ఉంటుంది.
వారం రోజులు బంద్ అంటే ఎవరికీ నిత్యావసర సరుకులపై ధ్యాస రావడం లేదు. కానీ ఒక వీకంతా తాగకుండా ఉండలేమని ఉండబట్టలేక షాపుల ముందు ఊడిపడ్డారు. మగమహారాజులే కాదు. మహారాణులు సైతం మందు షాపుల ముందు మందలుగా వాలిపోయారు. తమకు మాత్రం కిక్ వద్దా అంటూ క్యూలో నిలబడతున్నారు. వీళ్లందరికి మందు దొరుకుతుందో లేదో తెలియదు కానీ కరోనా మాత్రం కన్‌ఫాం అని దూరం నుంచి చూసిన వాళ్లు అనుకుంటున్నారు.