Diesel Prices in Delhi: డీజిల్ సెస్ తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం.. తగ్గనున్న డీజిల్ ధరలు

Diesel Prices in Delhi: ఒక పక్క కరోనా విలయంలో సామాన్య మానవుడు కొట్టుమిట్టాడుతుంటే... కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రో ధరలు రెండు నెలల కాలంగా పెంచుతూ వస్తోంది.

Update: 2020-07-31 03:45 GMT
Diesel Prices in Delhi

Diesel Prices in Delhi: ఒక పక్క కరోనా వైరస్ విలయంలో సామాన్య మానవుడు కొట్టుమిట్టాడుతుంటే... కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రో ధరలు రెండు నెలల కాలంగా పెంచుతూ వస్తోంది. దీనివల్ల సగటు మానవుడు రోడ్డుపైకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కరోనా వేళ సింగిల్ గా ప్రయాణం చేసే మోటార్ సైకిల్ పై వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ భారం ఎక్కువగా మద్యతరగతి వారిపై పడుతోంది. డీజిల్ విషయంలో ఇదే విధంగా వ్యవహరించడం వల్ల వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ సర్కార్ డీజిల్ పై రాష్ట్ర విధిస్తున్న సుంకాన్ని తగ్గించడం వల్ల అక్కడ వాటి ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఢిల్లీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కార‌ణంగా ఉపాధి, ఉద్యోగం కోల్పోయిన ప్ర‌జ‌ల‌పై భారాన్ని త‌గ్గించే దిశ‌గా కీల‌క అడుగు వేసింది. ముఖ్యంగా వాహ‌న‌దారుల‌పై ఆర్థిక భారం త‌గ్గించేందుకు ఢిల్లీలో డీజిల్‌పై విధిస్తున్న వ్యాట్‌ను 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గిస్తున్న‌ట్టు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ఢిల్లీ స‌ర్కార్ నిర్ణ‌యంతో దేశ రాజ‌ధానిలో డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ప్ర‌స్తుతం ఢిల్లీలో లీట‌ర్ డీజిల్‌పై ధ‌ర 82 రూపాయ‌లుండ‌గా.. ఇక‌పై రూ. 73.64కే ల‌భించ‌నుంది. అంటే డీజిల్‌పై రూ.8.36 మేర త‌గ్గుతుంది.

భారతదేశ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఇటీవల కాలంలో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. దేశంలో మారిన ఆర్థిక పరిస్థితుల కారణంగా పెట్రో-డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు చూసుకుంటే ఇప్పటివరకు పెట్రోల్ పై 8 రూపాయల 93 పైసలు, డీజిల్ పై 10 రూపాయల 7 పైసలు ధరలు పెరిగాయి. మరో వారం రోజులు పరిస్థితి ఇలానే కొనసాగుతుందంటున్నారు నిపుణులు.

లాక్ డౌన్ తో చమురు సంస్థలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. వాటిని పూడ్చుకునేందుకు ఇలా ప్రతి రోజూ పెట్రోల్-డీజిల్ రేట్లు పెంచుతున్నాయి. అయితే సగటు వినియోగదారుడిపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

లాక్ డౌన్ తో దేశం ఆర్థికంగా కుంగిపోయింది. రావాల్సిన ఆదాయ తగ్గిపోయింది. ఇలాంటి టైమ్ లో పెట్రోల్ పై పన్ను తగ్గించడానికి కేంద్రం సముఖంగా లేదు. అందుకే ఓవైపు రేట్లు పెరుగుతున్నప్పటికీ మోడీ సర్కార్ చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి కూడా అలానే ఉంది. లాక్ డౌన్ తో ఆదాయం బాగా పడిపోవడంతో.. ఇప్పటికిప్పుడు పెట్రోల్-డీజిల్ పై విధిస్తున్న స్థానిక పన్నుల్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడడం లేదు.

ఈ పరిస్థితులన్నీ కలిపి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ తో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. మరికొంతమంది సగం జీతాలతో నెట్టుకొస్తున్నారు. ఇలాంటి టైమ్ లో పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగాయంటే.. దానర్థం నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయన్నమాట. సో.. చమురు ధరల పెంపు అనేది సగటు భారతీయుడిపై పరోక్షంగా పెను ప్రభావం చూపించబోతోంది. ఆ దుష్ప్రభావం ఇప్పటికే మొదలైంది కూడా. అయితే దీనికి భిన్నంగా ఢిల్లీ ప్రభుత్వం డీజిల్ పై రాష్ట్ర సెస్ తగ్గించడంతో స్థానిక ప్రజలకు కొంత ఊరట లభించింది.  

Tags:    

Similar News