నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. 20రోజులకుపైగా ధర్నా చేస్తున్న అన్నదాతలు కేంద్రానికి తమ బాధను తెలియజేయడానికి రోజుకో విధంగా నిరసన తెలుపుతున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నాయకులు పలుమార్లు చర్చలు జరిపారు. అయినా ఎటువంటి ఫలితాలు వెలువడలేదు. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూనే ఉన్నారు.
అటు రైతుల ఆందోళన సుప్రీంకోర్టుకు చేరుకుంది. అయితే వివాదా పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ధర్మాసనం ఉన్నట్లు తెలుస్తోంది. కమిటీ వేయాలని సుప్రీంకోర్టు చేసిన సూచన సమస్యకు ఒక పరిష్కారం కాదని చట్టాలను పూర్తిగా ఉపసంహరించాల్సిందేనని రైతు నేతలు చెబుతున్నారు. సర్కూర్ నుంచి స్పందన కరువైనా చావుకు కూడా వెనకాడకుండా ఉద్యమానికి సై అంటున్నారు అన్నదాతలు. దీంతో ప్రతిష్టంభను తొలగించేందుకు గాను సాగు చట్టాల అమలును చర్చల నిమిత్తం కొద్ది రోజుల పాటు కేంద్రం నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రైతుల ఆందోళనకు ప్రముఖులు సైతం మద్దతు తెలియజేస్తున్నారు. అదేవిధంగా రైతుల్ని ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాలంటీర్లు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు కలుస్తున్నారు. దుప్పట్లు, ఆహార పదార్థాలు అందిస్తున్నారు. అటు కేంద్రానికి రైతులు ఇచ్చిన డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇవాళ తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు అన్నదాతలు.