కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవాళ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల నేతలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. చలో ఢిల్లీలో భాగంగా ఢిల్లీ–జైపూర్ హైవే ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు ఆదివారం షాజహాన్‌పూర్ వద్ద హైవేపైకి చేరుకుంటున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలువరిస్తున్నారు.
రైతు సంఘాల పిలుపు మేరకు ఆల్వార్ జిల్లా షాజహాన్‌పూర్ వద్ద జాతీయ రహదారి వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. రైతుల నిరసనల కారణంగా జైపూర్–ఢిల్లీ హైవే ట్రాఫిక్‌ను ఆల్వార్ జిల్లా బన్సూర్ తదితర మార్గాలకు మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం ఢిల్లీ నుంచి జైపూర్‌కు ఒన్‌వే ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష పాటిస్తారని రైతు సంఘం నేత తెలిపారు. దీంతో పాటు సోమవారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరుగుతాయన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు యథాప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు. రైతుల పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సాగు చట్టాలు మూడింటిని రద్దు చేయాలనే విషయంలో రైతు సంఘాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని ఆయన ప్రకటించారు.
చిల్లా మీదుగా వెళ్లే నోయిడా– ఢిల్లీ లింక్ రోడ్డులోని రవాణా వాహనాలు వెళ్లే ప్రాంతాన్ని రైతులు ఖాళీ చేయడంతో ఆ మార్గంలో రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇక్కడ రైతులు ధర్నా కొనసాగిస్తున్నారు. ఢిల్లీ, నోయిడాలకు కలిపే డీఎన్‌డీ, కాళిందీ కుంజ్ మార్గంలో వాహనాల రాకపోకలు నిరాటంకంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు టిక్రీ, ధన్సా సరిహద్దులను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
కేంద్రం అహంకారం వీడి కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను అంగీకరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇవాళ్టి రైతు సంఘాల పిలుపు మేరకు తనతో పాటు ఆప్ పార్టీ కార్యకర్తలు ఒకరోజు నిరాహార దీక్ష పాటిస్తారని ఆయన వెల్లడించారు. రైతుల ఆందోళనలను మావోయిస్టులు, వామపక్ష పార్టీలు, జాతి వ్యతిరేక శక్తులు హైజాక్ చేశాయంటూ కొందరు కేంద్ర మంత్రులు ఆరోపించడంపై ఎన్‌సీపీ తీవ్రంగా స్పందించింది.