ఢిల్లీ బ్లాస్ట్ ట్రైలర్ మాత్రమేనా..? దేశంలో మరిన్ని దాడులకు ఉగ్రమూకలు కుట్ర పన్నాయా..?
*బ్లాస్ట్‌కు తమదే బాధ్యత అని ప్రకటించుకున్న జైష్-ఉల్-హింద్ *ఘటనాస్థలంలో పింక్ స్కార్ఫ్, ఎన్వలప్ కవర్ *ఎన్వలప్ కవర్‌లో ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశిస్తూ లేఖ
దేశరాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేవలం ట్రైలర్ మాత్రమేనా..? దేశంలో మరిన్ని దాడులకు ఉగ్రమూకలు కుట్ర పన్నాయా..? ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర బ్లాస్ట్‌కు పాల్పడింది ఎవరు..? పేలుడికి కొన్ని నిమిషాల ముందు ఢిల్లీ పోలీసులకు కాల్ చేసిన ఆ అజ్ఞాతవాసి ఎవరు..?
ఢిల్లీ ఐఈడీ బ్లాస్ట్ కేవలం ట్రైలర్ మాత్రమేనా..?ఢిల్లీ పోలీసులకు కాల్ చేసిన అజ్ఞాతవాసి ఎవరు..? ఘటనాస్థలంలో పింక్ స్కార్ఫ్, ఎన్వలప్ కవర్ఎన్వలప్ కవర్‌లో అసలేం ఉంది..?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ బ్లాస్ట్‌కు తమదే బాధ్యత అని తీవ్రవాద సంస్థ జైష్-ఉల్-హింద్ ప్రకటించుకుంది. అక్కడితో ఆగకుండా ఈ దాడికి గర్విస్తున్నామంటూ పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. అయితే ఈ సంస్థ చేసిన ప్రకటన ఎంతవరకు నిజం అన్న యాంగిల్‌లో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. పేలుడు జరిగిన స్థలం వద్ద స్వాధీనం చేసుకున్న లేఖలో అరపేజీ వరకు చేతిరాత ఉందని, అది అస్తవ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఘటన జరిగిన ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన అధికారులు సగం కాలిన పింక్ స్కార్ఫ్, ఎన్వలప్ కవర్‌ను గుర్తించారు. ఎన్వలప్‌లో ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశిస్తూ ఉన్న లేఖలో ఢిల్లీ దాడిని కేవలం "ట్రైలర్" గా ప్రకటించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఘటన వెనుక పెద్ద కుట్రే ఉందని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకు సన్నాహకంగానే ఈ పేలుడు జరిపినట్లు భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే భారత్‌లో మరిన్ని దాడులకు ఉగ్రమూకలు కుట్ర పన్నినట్లేనని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇక ఈ బ్లాస్ట్‌కు సంబంధించి నిన్న ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తిని క్యాబ్ డ్రైవర్‌గా గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక విచారణలో తన క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించినట్లు తెలిపాడు డ్రైవర్. ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర దిగిన ఆ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా అనిపించడంతోనే పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలిపాడు.
ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రికి పూర్తి రక్షణ కల్పిస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హామీ ఇచ్చారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీనియర్ పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, జైపూర్, యూపీ తదితర రాష్ట్రాల్లో ఎయిర్ పోర్టులకు హై అలర్ట్ ప్రకటించారు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, సహా అన్ని ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.