ప్రపంచ రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీకి రెండో స్థానం...
Delhi Airport: మూడో స్థానంలో దుబాయ్ విమానాశ్రయం...
Delhi Airport: కరోనా తరువాత అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమవడతో.. ఢిల్లీ విమానాశ్రయం అంత్యంత రద్దీగా మారింది. నిత్యం ప్రయాణికుల రాకపోకలతో కిటకిటలాడుతోంది. మార్చిలో రాకపోకలు సాగించిన ప్రయాణికుల లెక్కలతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ రెండో స్థానం దక్కించుకుంది. ఆమేరకు అఫిషియల్ ఎయిర్‌లైన్ గైడ్-ఓఏజీ తాజా మార్చి వివరాలను వెల్లడించింది.
హార్ట్స్‌ఫీల్డ్- జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టుల్లో మొదటి స్థానంలో నిలవగా... తరువాతి స్థానంలో ఢిల్లీ, దుబాయ్ నిలిచాయి. కరోనాకు ముందు అంటే.. 2019లో రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ 23వ స్థానంలో ఉండేది. కరోనా సోకడంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం ప్రజలను తరలించేందుకు మాత్రమే విమానాలను వినియోగించారు.
కోవిడ్ టీకా రావడం.. అంతర్జాతీయంగా వైరస్ కేసులు తగ్గడంతో మళ్లీ అంతర్జాతీయ విమాన సేవలను పలు దేశాలు ప్రారంభించాయి. ఈ ఏడాది పరిమిత సంఖ్యలో అంతర్జాతీయ విమానాలను నడిపినా.. మార్చి 27 నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో ఢిల్లీ నుంచి భారీగా ప్రయాణికులు వివిధ దేశాలకు రాకపోకలు సాగించారు. దీంతో రద్దీ విమానాశ్రయాల్లో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం... దుబాయ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది.