అత్యంత ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం
* పలు ప్రాంతాలలో యథేచ్ఛగా టపాసులు కాల్చిన ప్రజలు * ఏకంగా 414కు పెరిగిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ…పలు ప్రాంతాలలో టపాసులు యథేచ్ఛగా కాలుస్తూ పండుగ సంబరాలు చేసుకున్నారు. దీంతో ఒక్క సారిగా వాయు కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థాయికి పెరిగిపోయింది. నిన్న హస్తినలో వాయు కాలుష్యం సూచి ...ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. ఏకంగా 414కు పెరిగింది. అంతకు ముందు రెండు రోజులతో పోలిస్తే వాయు కాలుస్య సూచి దాదాపు వంద పాయింట్లు పెరిగింది.
కాగా, గత కొంత కాలంగా ఢిల్లీ లో కాలుష్యం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినా, అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాలుష్య నివారణ ప్రభుత్వానికి సవాలుగా మారింది. శీతాకాలం కావడంతో ఒక పక్క చలి.. మరో పక్క పెరిగిపోయిన వాతావరణ కాలుష్యం..దీంతో ఢిల్లీ ప్రజలు నరకం చూస్తున్నారు. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో ఈరోజు అక్కడ కాలుష్య తీవ్రత మరింతగా విషమించింది.