Delhi: ఢిల్లీని ముంచెత్తిన కాలుష్యం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
Delhi - Air Pollution: ఢిల్లీలోని పుసారోడ్డు వద్ద 505కు చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్...
Delhi - Air Pollution: దీపావళి టపాసుల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్రంగా పడింది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు గాలిలో నాణ్యత దారుణంగా దిగజారింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 382గా నమోదుకాగా.. రాత్రి 8 గంటలక మరింత తీవ్రమయ్యింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 314 నుంచి 341 వద్ద ఉండగా, దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో నోయిడాలో AIQ 526కు పెరిగింది.
ఢిల్లీలో పూసారోడ్డు వద్ద 505కు చేరింది. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, గాలి వేగం కాలుష్యానికి మరింత ఊతమిచ్చింది. ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కి చేరింది. టపాసుల పేల్చిన తర్వాత గురువారం రాత్రి 9 గంటలకు ఢిల్లీ చుట్టుపక్కల ఫరిదాబాద్‌లో 424, ఘాజియాబాద్‌లో 442, గురుగ్రామ్‌లో 423, నొయిడాలో 431 గాలిలో నాణ్యత తగ్గి పరిస్థితి తీవ్రమయ్యింది.
నగరంలోని అనేక ప్రాంతాలు, దాని శివారు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు గొంతు దురద, కళ్లలో నీరు కారుతున్నట్లు ఫిర్యాదు చేశారు. పొగమంచు ఈ సీజన్‌లో ప్రారంభం కానప్పటికీ తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్500 దాటిందంటే తీవ్రమైన కాలుష్యం ఏర్పడిందని తేలింది. పంజాబ్, హర్యానాలో పొలాల మంటల నుంచి వెలువడిన పొగ దేశ రాజధాని వైపు వచ్చింది.పటాకుల వ్యతిరేక ప్రచారం చేయడంతోపాటు 13వేల కిలోలకు పైగా అక్రమ పటాకులను స్వాధీనం చేసుకొని, 33 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ అధికారులు చెప్పారు.
ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాపై నిషేధం విధించినప్పటికీ, దీపావళి సందర్భంగా చాలా మంది ప్రజలు వీధుల్లో క్రాకర్లు కాల్చడం కనిపించింది. దీంతోపాటు వ్యవసాయ పొలాల్లో మంటల నుంచి వెలువడిన పొగ వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. ఢిల్లీ ఆకాశాన్ని పొగమంచు దట్టమైన దుప్పటి కప్పివేసింది.