Rajnath Singh: హెలికాప్టర్‌ ప్రమాదంపై లోక్‌సభలో రాజ్‌నాథ్ ప్రకటన

Rajnath Singh: సాయంత్రం ఢిల్లీకి పార్థివదేహాలను తరలిస్తాం : రాజ్‌నాథ్ సింగ్

Update: 2021-12-09 07:30 GMT

Rajnath Singh: హెలికాప్టర్‌ ప్రమాదంపై లోక్‌సభలో రాజ్‌నాథ్ ప్రకటన

Rajnath Singh: భారత తొలి సీడీఎస్ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు వెల్లడించారు.

బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న మిలిటరీ హెలికాప్టర్‌ డిసెంబరు 8న తమిళనాడు వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ స్టాఫ్‌ కాలేజ్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. నిన్న ఉదయం 11గంటల 48నిమిషానికి సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి MI 17 V 5 హెలికాప్టర్‌లో రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లింగ్టన్‌ బయల్దేరారు.

మధ్యాహ్నం 12గంటలకు 15 నిమిషాలకు వీరు ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా.. 12గంటల 08 నిమిషాల ప్రాంతంలో హెలికాప్టర్‌ రాడార్‌ నుంచి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సంకేతాలు నిలిచిపోయాయి. కున్నూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలను గుర్తించిన స్థానికులు అక్కడకు వెళ్లారు. అప్పటికే హెలికాప్టర్‌ మంటల్లో ఉంది. సమాచారమందుకున్న రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. రావత్‌, హెలికాప్టర్‌ ప్రయాణికులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాదంలో రావత్‌, ఆయన సతీమణి సహా 13 మంది దుర్మరణం చెందడం బాధాకరమని రాజ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు.

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలను రేపు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాజ్‌నాథ్ వెల్లడించారు. ఈ సాయంత్రానికి రావత్‌ దంపతుల భౌతికకాయాలు ఢిల్లీకి చేరుకుంటాయని తెలిపారు. ప్రమాదంపై భారత వాయుసేన.. త్రివిధ దళాల దర్యాప్తును ఆదేశించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఎయిర్‌ మార్షల్‌ మానవీంద్ర సింగ్‌ నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ బృందం వెల్లింగ్టన్‌ చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఆయనను కాపాడేందుకు అన్ని యత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్‌ సింగ్‌కు వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అవసరమైతే బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News