అమర జవాన్లకు అశ్రు నివాళి..స్వస్థలాలకు చేరుకున్న వీరుల పార్ధీవ దేహాలు!
* జమ్ము కశ్మీర్ లో వీరమరణం పొందిన జవాన్లకు నివాళి * పార్ధీవ దేహాలను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన అధికారులు * ప్రవీణ్ కుమార్ రెడ్డి మృతదేహం రేణిగుంటకు తరలింపు * మహేష్ భౌతికకాయం నిజామాబాద్ జిల్లా కోమన్ పల్లికి తరలింపు * సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహణకు ఏర్పాట్లు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన తెలుగు జవాన్లు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ర్యాడా మహేశ్ మృతదేహాలు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత వారి వారి స్వగ్రామాలకు తరలించారు. నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లికి చెందిన మహేశ్ పార్థివ దేహనికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, నార్త్‌జోన్ డీసీపీ కమలేశ్వర్ నివాళులర్పించారు. ఆ తర్వాత మహేశ్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు.
దేశ సరిహద్దుల్లో ఉగ్రమూకల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన వీరజనవాన్ ర్యాడ మహేశ్ పార్ధివదేహం మంగళవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత అతని స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోమన్ పల్లికి చేరుకుంది. ఆశ..శ్వాస ఆర్మీనే అంటూ ఐనవాళ్లకు దూరంగా ఉంటూ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఎదిరించిన మహేష్ విగత జీవిగా రావడంతో పురిటిగడ్డ ఘొల్లుమన్నది. మహేష్ కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రమయ్యారు. అనునిత్యం దేశ సేవకై పరితపించే మహేష్ భరతమాత కోసం ప్రాణత్యాగం చేసినందుకు గర్వపడుతున్నామన్నారు. ప్రతీ ఒక్క యువకుడు కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని చెబుతూ యువకులకు ఆదర్శంగా నిలిచేవాడని చెప్పారు.. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రోదించడం అందరిని కలిచివేసింది.
ఉదయం 10 గంటల తర్వాత అంతిమయాత్ర ప్రారంభంకానుంది. మహేష్ ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న వైకుంఠధామంలో అంత్యక్రియలు చేపట్టనున్నారు. రాజకీయ ప్రముఖులు, జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు హాజరుకానున్నారు. అంతిమ కార్యక్రమాన్ని చూసేందుకు భారీగా జనం వచ్చే అవకాశం ఉందని అంచనావేశారు. ఆర్డీవో శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ర్యాలీ నిర్వహించాలని భాజపా ఇప్పటికే పిలుపునిచ్చింది. అన్న మృతి సమాచారం తెలియటంతో తమ్ముడు భూమేష్ గల్ఫ్ నుంచి మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నారు.
కశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పొయిన కమాండో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పార్థివదేహం అతడి స్వగ్రామమైన ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు తరలించారు. ఢిల్లీ నుంచి ప్రవీణ్ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు...ఎయిర్ పోర్టు, పోలీసు అధికారులు నివాళులర్పించిన తర్వాత రెడ్డివారిపల్లెకు పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. ప్రవీణ్ దహన సంస్కారాలు ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదులతో పోరాటంలో వీర మరణం పొందిన ప్రవీణ్ లేకపోవడం తమకు తీరని లోటని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.