కేరళ గోల్డ్ స్కామ్‌లో అండర్ వాల్డ్ డాన్ దావూద్ లింకులు

Update: 2020-10-15 16:15 GMT

కేరళ బంగారం అక్రమ రవాణాకు అండర్ వాల్డ్ డాన్‌ దావూద్‌కు సంబంధం ఏంటి ? అసలు స్మగ్లింగ్ చేస్తే వచ్చిన డబ్బులతో ఏం చేయాలనుకున్నారు ? ఎన్ఐఏ విచారణలో వెలుగుచూసిన విషయాలు ఏంటి ?

సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ముమ్మరం చేసింది. ఈ బంగారం అక్రమ రవాణాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, డీ గ్యాంగ్ హస్తం ఉన్నట్టుగా ఎన్‌ఐఏ భావిస్తోంది. ఈ మేరకు కొచ్చిలోని ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. ఈ కేసుకు సంబంధించి కస్టడీలో ఉన్న ఏ-5 రమీజ్‌ను విచారించినప్పుడు అతను కీలక విషయాలు బయటపెట్టినట్లుగా తెలుస్తోంది.

మహమ్మద్ షఫీ అనే వ్యక్తి బంగారం అక్రమ రవాణాలో ప్రధాన సూత్రదారుడిగా ఉన్నాడని ఎన్ఐఏ వివరించింది. రమీజ్‌తో కలిసి 2019 నవంబర్ నుంచి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడని తెలిపింది. వీరు యూఏఈ కాన్సులేటు నుంచి డిప్లమేటిక్ బ్యాగేజ్ ద్వారా 21సార్లు బంగారం అక్రమంగా తరలించారని చెప్పింది. భారత ఆర్థిక వ్యవస్థ భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు తెలిపింది. దౌత్య మార్గాల ద్వారా గోల్డ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఈ కేసులో నిందితులకు బెయిల్‌ ఇవ్వరాదని న్యాయస్ధానానికి ఎన్ఐఏ విజ్ఞప్తి చేసింది.

బంగారం అక్రమరవాణా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు, జాతి వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడని నిఘా వర్గాలు సమాచారం అందించాయని ఎన్ఐఏ వివరించింది. ఐతే ఇప్పుడు అండర్ వాల్డ్ డాన్ దావూద్‌కు లింక్ ఉందన్న అనుమానాలు వినిపిస్తుండడంతో కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందా అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి స్వప్న సురేష్‌, సరిత్‌తో పాటు మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Tags:    

Similar News