Dalai Lama: భారత్ కు దలైలామా ఆర్థిక సాయం

Dalai Lama: టిబెట్‌ బౌద్ధగురువు దలైలామా కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Update: 2021-04-28 03:09 GMT

Dalai Lama:(File Image)

Dalai Lama: కరోనా సెకండ్ వేవ్ తో ఫైట్ చేస్తున్నభారత్‌కు సహాయమందించేందుకు ప్రపంచ దేశాలన్నీ ముందుకొస్తున్నాయి. తాజాగా టిబెట్‌ బౌద్ధగురువు దలైలామా కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తన ట్రస్ట్‌ ద్వారా భారత ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ''భారత్‌ సహా ప్రపంచమంతా కొవిడ్‌ మహమ్మారితో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో భారత సోదర, సోదరీమణులకు అండగా ఉండేందుకు పీఎం-కేర్స్‌ ఫండ్‌కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్ట్‌ను కోరాను. మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాల సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అభినందనలు. కొవిడ్‌ ముప్పు త్వరలోనే తొలగిపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా'' అని దలైలామా పేర్కొన్నారు.

అటు కరోనాపై పోరులో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండేందుకు టెక్‌ కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ వివో ఇండియా.. ఆక్సిజన్‌ సరఫరా నిమిత్తం రూ. 2కోట్ల విరాళం ప్రకటించింది. కరోనా తొలి దశలోనూ వివో తన వంతు సహకారం అందించింది. అప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు 9లక్షల మాస్క్‌లు, 15,000 పీపీఈ కిట్లు, 50వేల లీటర్ల శానిటైజర్లను వితరణగా అందించింది.

గూగుల్ సంస్థ ముందుకొచ్చింది రూ.135 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు సీఈవో సుందర్ పిచాయ్. కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న గివ్ ఇండియాకు, యూనిసెఫ్‌కు ఈ ఫండ్ అందించనున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News