Joshimath: ఉత్తరాఖండ్ జోషిమఠ్‌లో.. రోడ్లపై పగుళ్లు, కూలుతున్న ఇళ్లు, కుంగుతున్న భూమి
Joshimath: సుమారు 600 ఇళ్లకు పగుళ్లు, 3వేల మందిపై ఎఫెక్ట్
Joshimath: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. భూమి కుంగిపోవడంతో అక్కడ సుమారు 600 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. దీంతో సుమారు 3వేల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 60 కుటుంబాలు తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి తొమ్మిది వార్డుల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. కొన్నిచోట్ల కింది నుంచి నీళ్లు ఉబికివస్తున్నట్లు గుర్తించారు. ఐఐటీ రూర్కీతో పాటు పలు సంస్థల నిపుణులు ఘటనా స్థలానికి వెళ్లి బీటలు వారడానికి కారణాలను అన్వేషిస్తున్నారు.
ఇప్పటి వరకు జోషీమఠ్‌లోని వివిధ ప్రాంతాల్లో 561 ఇళ్లు బీటలు వారినట్లు గుర్తించామని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మరోవైపు గతకొన్ని రోజుల నుంచి ఈ సమస్య తలెత్తుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ఇళ్లు బీటలు రావడానికి కారణమైన NTPC టన్నెల్, హేలంగ్- మార్వాడీ బైపాస్ రోడ్డు నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.