Coronavirus: ఐదు రాష్ట్రాల సీఎంలకు కోవిడ్ పాజిటివ్
Coronavirus: ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రులు * నిన్న సీఎం కేసీఆర్‌కు కోవిడ్ పాజిటివ్
Coronavirus: ఏడాదిన్నరగా ప్రపంచంలో కోవిడ్ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. కంటికి కనిపించని ఈ మహమ్మారికి వారు వీరనే తేడా లేదు. సామాన్యుల నుంచి పెద్ద మనుషుల దాకా అందరినీ పలకరించిపోతుంది. మొదట్లో కాస్త కుదురుగానే వ్యాపించిన కరోనా సెకండ్‌వేవ్‌లో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. కాస్త నిర్లక్ష్యం వహిస్తే.. కాటేస్తానంటూ కాచుకు కూర్చుంది. దేశంలో ఐదుగురు సీఎంలతో పాటు మాజీ ప్రధానులు, మాజీ సీఎంలు కోవిడ్ బారిన పడ్డారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా భయానక పరిస్థితులు సృష్టిస్తోన్న కోవిడ్ ప్రజాప్రతినిధులనూ వదల్లేదు. తాజాగా తెలంగాణ సీఎం కరోనా బారిన పడగా.. రీసెంట్‌గా తమిళనాడు సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి కరోనా సోకింది. ప్రస్తుతం ఈ ఐదుగురు సీఎంలు ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. సీఎం కేసీఆర్‌కు సోమవారం జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆయన వైద్యుల సలహా మేరకు ఫామ్‌హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఆయనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. సీఎం ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.
ఇటీవల కరోనా బారిన పడిన పళనిస్వామి కాస్త కోలుకున్నారు. ఆయనకు టెస్టుల్లో నెగెటివ్‌గా తేలింది. అయితే ఆయన్ను ప్రస్తుతం హెర్నియా ఆపరేషన్ కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ఇక ఐదు రోజుల క్రితం పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. ఐసోలేషన్‌లో ఉంటూనే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారాయన. నాలుగు రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కర్ణాటక సీఎం యడియూరప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు. జ్వరంతో బాధపడిన ఆయనకు కోవిడ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ అని నిర్ధారణైంది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఇటీవలే రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకున్నప్పటికీ మన్మోహన్ సింగ్ కోవిడ్ బారిన పడ్డారు. ఇక మన్మోహన్ వయసుతో పాటు ఆయన మెడికల్ రికార్డులను దృష్టిలో ఉంచుకుని.. ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు ఎయిమ్స్ వైద్యులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.