Delta Variant: అమెరికాను వణికిస్తోన్న డెల్టా వేరియంట్
Delta Variant Cases in US: టీకా వేయించుకోని వారిపై డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్నట్లు అమెరికా వైద్య నిపుణులు స్పష్టం చేశారు.
Delta Variant Cases in US: ఇండియాను అతాలకుతలం చేసిన కరోనా డెల్టా వేరియంట్ ఇపుడు అమెరికాను వణికిస్తోంది. ఇప్పటి వరకు వెలుగు చూసిన వేరింట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ ప్రధాన కారకంగా మారిందని అమెరికా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ చిన్నారులపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్న కొత్త కేసుల్లో 80శాతం కంటే అధికంగా డెల్టా రకం కేసులే వెలుగు చూస్తున్నట్లు అమెరికా ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
టీకా వేయించుకోని వారి పై డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్నట్లు అమెరికా వైద్య నిపుణులు అన్నామోరీ డేవిడ్ సన్ వివరించారు. కరోనా డెల్టా వేరియంట్ కు సంక్రమణ తీవ్రత అధికమని, దీన్ని తీవ్రమైనదిగా పరిగణించాలన్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు. గ్యాల్వెస్టన్ కౌంటీ ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం ఆ జిల్లలో నమోదైనా 450 కేసుల్లో 6-12 ఏళ్ల మధ్య వయసు గల చిన్నారుల్లో 57 మంది డెల్టా బారిన పడ్డారు.
డెల్టా సోకితే చాలా వరకు ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాల్సి వుంటుందని, తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కోవాల్సి వుంటుందని వివరించారు. అమెరికాలో చిన్నారులపై డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో రెండేళ్లు దాటిన చిన్నారులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలు వుండే అమెరికానే డెల్టా వేరియంట్ వల్ల ఇబ్బందులు పడుతుంటే అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి ఏంటిని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. సంపన్న దేశాలు ఒక వైపు ఆంక్షలను సడలిస్తుండగా, మరోవైపు ఆసియా దేశాలు తాజా కేసులతో పోరాడుతున్నాయని పేర్కొంది. టీకా రేటుతో సంబంధం లేకుండా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. మాస్ టూరిజంతో సంపన్నదేశాల ప్రజలు సాధారణ జీవనంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. దేశాల్లో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ధనిక దేశాలు ఆంక్షల సడలింపును వెనక్కి తీసుకోవాలన్నారు. లేకపోతే మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచం అంతా సామూహికంగా ఒక్కటై ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొవాలని ఆయన పేర్కొన్నారు.