దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులు
* కోవిడ్‌పై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం
Covid: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి.. ఇప్పుడు మరోసారి నెమ్మదిగా జూలు విదిలిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. కట్టడి దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కరోనా పరిస్థితి, దాన్ని ఎదుర్కోవడానికి ప్రజా ఆరోగ్యశాఖ సన్నద్ధతపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చరిస్తున్నారు.
గడిచిన 24గంటల వ్యవధిలో కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 11 వందల 34 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క్రియాశీలక కేసులు 7వేల 26కు చేరుకున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్ తో మృతిచెందారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడిచినవారి సంఖ్య 5 లక్షల 30 వేల 813కి చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.09%గా ఉండగా.. మరణాల రేటు 1.19శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220 కోట్ల 65 లక్షల డోసుల కొవిడ్ టీకాను పంపిణీ చేశారు.