ICMR - Covid Third Wave: ఆగస్టు నెలాఖరులో థర్డ్ వేవ్
ICMR: ప్రజల నిర్లక్ష్యం కారణంగా భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
ICMR - Covid Third Wave: ప్రజల నిర్లక్ష్యం కారణంగా భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్య పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌కు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తాజాగా కేసులు పెరుతుండడం అందరినీ కలవరపెడుతోంది.
కరోనా థర్డ్ వేవ్ ఆగస్టు నెలాఖరులో విరుచుకుపడే అవకాశం ఉందని, రెండో వేవ్ తరహాలో ఈసారి తీవ్రత అంతగా ఉండబోదని ఐసీఎంఆర్‌కు చెందిన నిపుణులు హెచ్చరించారు. వైరస్ వ్యాప్తికి దారితీసే సామూహిక కార్యక్రమాలను నియంత్రించాలని సూచించారు. భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తథ్యమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలే ప్రకటించింది. కఠినమైన నియంత్రణ చర్యలతో థర్డ్ వేవ్ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఐఎంఏ సూచించింది. కరోనా హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేయడం లేదని, వాతావరణ సూచనల తరహాలో తేలిగ్గా తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది.
కరోనా మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ హెచ్చరించారు. కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు ప్రారంభ దశలో ఉందన్నారు. వరల్డ్‌వైడ్‌గా డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని తెలిపారు. ప్రజలు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటూ, కరోనా రూల్స్‌ను పాటించాలని సూచించారు. అయితే మూడో వేవ్ నియంత్రణ మన చేతుల్లోనే ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించడం, మాస్కులు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం వంటి చర్యలతో కరోనా థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు. తదుపరి కరోనా వేవ్ సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరిగినట్లు తెలిపారు. అన్ని ఆంక్షలను ఎత్తివేస్తే, రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే కరోనా వేరియంట్ తప్పించుకోగలిగితే రెండో వేవ్ కంటే మూడో వేవ్ ఉధృతి అధికంగా ఉంటుందని వెల్లడించారు.