Covid 19 New Guidelines: సినీప్రియులకు గుడ్ న్యూస్..థియేటర్లకు ఫుల్ పర్మిషన్
దేశంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో ఆంక్షలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సడలించిన నిబంధనల్లో సినీప్రియులకు, పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు శుభవార్త అందించింది. కంటెయిన్‌మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. గతంలో విధించిన నిబంధనలు జనవరి 31తో ముగియడంతో కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త గైడ్‌లైన్స్ అమల్లోకి రానున్నాయి.
సినిమా థియేటర్లు 50 శాతం సీటింగ్ కెపాసిటీకి మాత్రమే అనుమతి ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నుంచి గరిష్ట సీటింగ్ సామర్థ్యంతో ప్రదర్శనలు కొనసాగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఎగ్జిబిషన్ హాళ్లకు అనుమతి ఇస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. కేవలం వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు.
స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు క్రీడాకారులకు మాత్రమే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి ఉండగా.. ఫిబ్రవరి 1 నుంచి ఈత కొలనులను అందరికీ అనుమతిస్తున్నట్లు హోం శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.