Delhi: తగ్గిన గ్యాస్ ధర.. ఎంతో తెలుసా!

Delhi: గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.10 తగ్గించిన చమురు సంస్థలు

Update: 2021-04-01 01:09 GMT

ఢిల్లీ:(ఫోటో ది హన్స్ ఇండియా)

Delhi: గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.10 తగ్గిస్తున్నట్లు బుధవారం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగివస్తుండడంతో దేశీయ చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వారం వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మూడు దఫాలు స్వల్పంగా తగ్గించాయి. తాజాగా 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌కు రాయితీ వినియోగదారులు, మార్కెట్‌ ధరకు కొనేవారు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి రూ.819కు బదులు రూ.809 చెల్లిస్తే చాలని బుధవారం విడుదలచేసిన ప్రకటనలో పేర్కొంది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో రెండో దఫా పోలింగ్‌కు ముందు రోజు ఎల్‌పీజీ ధర తగ్గింపు ప్రకటన వెలువడడం గమనార్హం. ''ఆసియా, ఐరోపాల్లో కొవిడ్‌-19 కేసులు పెరుగుతుండడం, టీకా దుష్ప్రభావాలపై ఆందోళనల కారణంగా గత నెల ద్వితీయార్థం నుంచి అంతర్జాతీయంగా చమురు ధరల్లో తగ్గుదల నమోదవుతోంది. ఈ కారణంగా దేశంలో చిల్లర విక్రయాలకు సంబంధించి పెట్రోల్‌పై లీటర్‌కు 61 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు 60 పైసల మేర ధర దిగివచ్చింది'' అని ఐవోసీ వివరించింది.

ఇటీవలి కాలంలో దేశీయంగా రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) ధరలు.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో మరింత దిగివచ్చే అవకాశముందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే పెరగడం మాత్రం భారీగా వుంటోందని, తగ్గించేటపుడు మాత్రం స్వల్పంగా తగ్గుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News