Covid19 Vaccine in India: కరోనా వైరస్ భయానకంగా వ్యాపిస్తుండటంతో తిరిగి సంపూర్ణ లాక్‌డౌన్ విధించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్న వేళ ఒక శుభవార్త ఫుల్‌జోష్ నింపుతోంది. కరోనాను ఖతం పట్టించి మహమ్మారికి దడ పుట్టించే మందుకు భారత్ బయోటెక్ శ్రీకారం చుట్టబోతోంది. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు, మేధావులు వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉండగా పూర్తి స్వదేశీ వ్యాక్సిన్‌కు తెలంగాణ నుంచే తొలి అడుగు పడినట్టయింది. కొవిడ్-19 విరుగుడు కోసం రూపొందించిన స్వదేశీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం అంగీకరించడంతో కొవ్యాక్సిన్ పేరుతో రూపొందించిన వ్యాక్సిన్‌ను జులై తొలి వారం నుంచే మనుషులపై ప్రయోగించనున్నారు. అది సక్సెస్ అయితే, అతి కొద్ది కాలంలోనే ప్రపంచానికి కరోనా పీడ విరగడయ్యే అవకాశాలున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కరోనా మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్‌ను ఆవిష్కరించనుంది. ఆ కంపెనీ రూపొందించిన కోవ్యాక్సిన్‌కు డీసీజీఐ అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. జులై తొలివారంలో మానవులపై ప్రయోగించి ఐసీఎంఆర్ సహకారంతో వ్యాక్సిన్ తయారీకి సిద్ధమవుతోంది. ఇది విజయవంతమైతే కోవిడ్ నియంత్రణకు తయారవుతున్న తొలి స్వదేశీ వ్యాక్సిన్ చరిత్రాత్మకం అవుతుంది
భారతదేశపు తొట్టతొలి కోవిడ్ మందు కోవ్యాక్సిన్‌కు భారతీయ ఔషధ నియంత్రణ మండలి అనుమతి దక్కింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ సంస్థ దీనిని రూపొందించింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో తెలంగాణకు చెందిన ఈ సంస్థ ఇప్పటివరకూ జరిపిన ప్రయోగాలు, జంతువులలో ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు వంటి అంశాలను డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా పరిగణనలోకి తీసుకుంది. ఈ వ్యాక్సిన్ ఫేజ్ 1, 2 స్థాయిల ప్రయోగాలకు అనుమతి వచ్చిందని, జులై నుంచే మొదలుకున్నాయి. ఔషధ పరిశోధనా రంగంలో మంచి అనుభవం ఉన్న భారత్ బయోటెక్ నుంచి వచ్చిన వ్యాక్సిన్ కచ్చితంగా విజయవంతమవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
వైరస్ సంబంధిత వ్యాధులకు సంబంధించి వ్యాక్సిన్‌ల తయారీలో భారత్ బయోటెక్ ట్రాక్ రికార్డు బాగుంది. కరోనా వైరస్ తలెత్తిన దశలోనే దీనికి సంబంధించి మందును కనుగొనే పరిశోధనలకు అనుమతి కోసం అప్పట్లోనే ఐసీఎంఆర్‌కు కంపెనీ అభ్యర్థన పంపించింది. తరువాతి దశలలో వీరు జరిపిన పరిశోధనలు. ప్రయోగాల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నారు. భారత్ బయోటెక్ ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ వైరస్ నివారణ మందును రూపొందించనుంది. ఇకపై జరిగే మనుష్యుల్లో పరీక్షలు విజయవంతమైతే, ఇది సమర్థవంతమైన వ్యాక్సిన్ అవడం ఖాయం.
అంతుచిక్కని మహమ్మారిగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విరుగుడుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా సరైన మందు రాలేదు. ఏదో ఓ దశలో వైరస్ చికిత్స విషయంలో ఇవి విఫలం అవుతూ రావడం, కొన్ని సందర్భాలలో ఇతరత్రా అవలక్షణాలు తలెత్తడంతో ప్రపంచ స్థాయిలో ఇప్పటివరకూ కరోనా మందు స్థానం ఖాళీగానే ఉంది. ఈ దిశలో భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ ఒకటి రెండు అడుగులు ముందుకు వేసింది. గిలీడ్ సైసెన్స్ వారి రెమ్‌డెసివిర్ పనితీరు కొంత మెరుగ్గా ఉంది. రోగులకు కొంత ఉపశమనం కల్గించినట్లు తేలింది. అయితే పూర్తి స్థాయిలో వైరస్ కాటు నుంచి నయం అయినట్లు మాత్రం నిర్థారణ కాలేదు.
స్వదేశీ కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కంపెనీతో జట్టు కట్టింది. వ్యాక్సిన్ తయారీలో ప్రక్రియలో పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా ఇందుకు సహకరిచింది. కరోనా వైరస్‌కు సంబంధించిన టెక్నాలజీని ఎన్ఐవీ.. భారత్ కంపెనీకి బదిలీచేసిన తర్వాత ప్రయోగాలు విజయవంతంగా సాగాయి. అన్నీ అనుకున్నట్లే జరిగితే, ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్-19కు విరుగుడు మందును ముందుగా ఇండియానే రూపొందించినట్లవుతుంది.
అసలు వ్యాక్సిన్ తయారీలో ఏం పరీక్షిస్తారన్నది ఆసక్తికరమైన అంశం. కరోనాకు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుందో అంచనావేస్తారు. అదే సమయంలో ప్రమాదకరమైన సైడ్‌ఎఫెక్ట్‌లు లేవని ప్రూవ్ చెయ్యాలి. మంచి రోగనిరోధక శక్తిని పెంపొందించాలి. వీరు టీకా వేయించుకొన్న ఏడు రోజులపాటు తమ లక్షణాలను నమోదు చేయాలి. నమూనాలు సేకరించిన వారిలో కొవిడ్ లక్షణాలు, ఏమైనా కనిపించాయేమో పరీక్షిస్తారు. వారి ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తోందో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తారు. మొత్తం సక్సెస్ అయితే, వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తెస్తారు. కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న ప్రపంచం, అత్యంత ఆశగా ఎదురుచూస్తోంది వ్యాక్సిన్ కోసమే.
ఏమైనా కరోనాను తరిమికొట్టేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. పోలియోతో పాటు ఎన్నో భయానక వైరస్‌లపై విజయం సాధించిన మావవాళి, కోవిడ్ మహమ్మారిని కూడా భూగోళం అవతల విసిరిపారేసేందుకు కసిగా పరిశోధిస్తోంది. తుమ్మినా, దగ్గినా, ముట్టుకున్నా, వస్తువులను తాకినా, ఆమాంతం మింగేస్తున్న వైరస్‌ను పారద్రోలేందుకు మందును తయారు చేయడంలో ఒక్కో దశను సక్సెస్‌ఫుల్‌గా దాటుతోంది. బయటికి రావాలంటేనే వణికిపోతున్న మానవాళికి భరోసానిస్తోంది.
మామూలుగా అయితే, ఏ వ్యాక్సిన్‌నైనా తయారు చేసేందుకైనా కనీసం 12 నుంచి 18 నెలల టైం పడుతుందన్నది పరిశోధకుల అంచనా. అయితే, కరోనా వ్యాక్సిన్ విషయంలో, ఆ టైమ్‌ను మరింత తక్కువ చేసేందుకు కృషి చేస్తున్నారు. అతి త్వరలో వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తెచ్చేందుకు దేశాలు, అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలు ప్రతిష్టాత్మకంగా ప్రయోగాలు చేస్తున్నాయి. కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం కొత్త పద్ధతిలో పని జరుగుతోంది. పరీక్షలు తక్కువగా చేస్తున్నారు. వీటిని ప్లగ్ అండ్ ప్లే విధానాలుగా పిలుస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాతో సహా... కరోనాకు పుట్టిల్లైన చైనా, జపాన్ దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధిలో తలమునకలై ఉన్నాయ్. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో సానుకూల ఫలితాలు రావడంతో మందు వస్తుందన్న ఆశ కనిపిస్తోందిప్పుడు. యూరప్ దేశాలు కూడా, మహమ్మారితో తాడోపేడో తేల్చుకునేందుకు కుస్తీ పడుతున్నాయి.
కరోనా కేసులు, మరణాలతో అగ్రస్థానంలో వున్న అమెరికా, వ్యాక్సిన్ తయారీలోనూ అగ్రస్థానంలోనే వున్నామంటోంది. మొదట వ్యాక్సిన్ తెచ్చేది తామేనంటున్న అధ‌్యక్షుడు ట్రంప్, అతి త్వరలో అందుబాటులోకి తెస్తామంటున్నారు. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడర్నా ఐఎన్‌సీ, ఈ ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ తయారీకి సై అన్న ఐఎన్‌సీ, ఫస్ట్ స్టెప్‌లో భాగంగా 8 మందిపై ప్రయోగం జరిపింది. మంచి ఫలితాలొచ్చాయంటోంది. ఈ వ్యాక్సిన్‌తో కరోనా వైరస్ పై పోరాడే యాంటీబాడీస్ వృద్ధి చెందాయని కూడా వెల్లడించింది. ఎంఆర్‌ఎన్‌ఏ–1273 వ్యాక్సిన్ పేరుతో మార్చి లో జరిపిన ఈ పరిశోధనల గురించి ఇటీవలే ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. జూలైలో మరో ప్రయత్నం చేస్తామంటోంది.
అమెరికాకు చెందిన ఫైజర్ అనే కంపెనీ కూడా జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ అనే సంస్థతో కలసి ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ రూపొందించడంలో బిజీగా వుంది. బీఎన్‌టీ–162 పేరుతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 360 మందిపై ప్రయోగించి సక్సెస్ అయ్యామంటోంది. జూలైలో ఏకంగా అమెరికా వ్యాప్తంగా ఎనిమిది వేల మందిపై ప్రయోగించబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికాకే చెందిన నోవా వ్యాక్స్ అనే మరో సంస్థ కూడా, వ్యాక్సిన్ పరిశోధనల్లో నిమగ్నమైంది. కరోనాతో అల్లాడిపోయిన ఇటలీ, దాని మీద కసి తీర్చుకునేందుకు వ్యాక్సిన్ ఆయుధాన్ని రూపొందిస్తోంది. కరోనా వైరస్ టీకా తయారీలో గణనీయ ప్రగతి సాధించామంటోంది. రోమ్‌లోని స్పాల్లంజనీ ఆస్పత్రిలో ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించామన్న ఇటలీ, తయారైన యాంటీబాడీలు మానవ కణాలపై ప్రభావవంతంగా పనిచేసినట్లు భావిస్తున్నామంటోంది.
కరోనా వైరస్‌లో సంభవించే ఎలాంటి మార్పులనైనా తట్టుకునే సామర్థ్యం ఈ యాంటీబాడీలకు ఉంటుంది ఇటలీ పరిశోధకుల బృందం. ఇప్పటి వరకు తయారయిన టీకాలన్నీ డీఎన్‌ఏ ప్రొటీన్ ఆధారంగా చేసుకుని రూపొందించినవేనని, తాము తయారు చేసిన టీకా అత్యంత అధునాతనమైనదని చెబుతోంది. మరికొద్దిరోజుల్లోనే మనుషులపై కూడా ప్రయోగిస్తామంటోంది. ఇలా అగ్ర దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలైవున్నాయి. టీకా తయారీ కోసం పోటాపోటీపడుతున్నాయి. ఈ పోటీ పుణ్యామా అని, అతి త్వరలో కోవిడ్ వ్యాక్సిన్ రావడం ఖాయమంటున్నారు నిపుణులు.
ఏమైనా త్వరలోనే కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ లభించే అవకాశాలు ఉన్నాయన్న శుభ సందేశాలే అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి. అది కూడా భారత్ నుంచి... ఇంకా చెప్పాలంటే తెలంగాణ నుంచే వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే రోజుల వ్యవధిలోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. కరోనా బాధితులకే కాదు... దాని బారిన పడకుండా కూడా ఇతరులు రక్షించుకునే వ్యాక్సిన్లు ఎంత త్వరగా వస్తే అంత మంచిది.