Coronavirus Effect: డిసెంబరు నాటికి కరోనా తగ్గుదల.. ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక వెల్లడి
Coronavirus Effect: కరోనా తీవ్రత చూస్తుంటే ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నాం.
Coronavirus Effect: కరోనా తీవ్రత చూస్తుంటే ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నాం. ఇదే పరిస్థితి మరికొన్ని నెలలు కొనసాగితే వ్యాధి లేని వారు కనిపించరేమో అని ఆందరిలో అందోళన కలుగుతోంది. అటువంటి వారికి చల్లని కబురు చెప్పింది ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక. సెప్టెంబరు మొదటి వారంలో పెరుగుదల తీవ్రంగా ఉన్న చివరి నుంచి క్రమేపీ తగ్గుతుందని, డిశెంబరు 3 కల్లా చాలా వరకు వెనుకబడుతుందని ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఇప్పటికే కేసులు తీవ్రమై తగ్గుముఖం పట్టిన పట్టణాల్లోని పరిస్థితులను అంచనా వేసి ఈ సంస్థ నివేదిక తయారు చేసింది.
భారత్‌లో కరోనా వైరస్ కేసులు 28 లక్షల మార్క్‌ను దాటడంతో వైరస్ వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కోవిడ్-19 విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ఇండియా ఔట్‌బ్రేక్ నివేదిక (ఐఓఆర్) ఊరట కలిగించే అంశాలు వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ 3 నాటికి కోవిడ్-19 భారత్‌లో వెనుతిరుగుతుందని స్పష్టం చేసింది. భారత్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మీదట సెప్టెంబర్ తొలివారం నాటికి ముమ్మర దశకు చేరుతాయని ఐఓఆర్ అంచనా వేసింది. ఆ సమయానికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 7,80,000కు చేరుతాయని పేర్కొంది. సెప్టెంబర్ ప్రధమార్ధంలో వైరస్ తీవ్రంగా ప్రబలినా మాసాంతానికి క్రమంగా తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. భారత్‌లో డిసెంబర్ 3 నుంచి కోవిడ్-19 వెనుకపడుతుందని ఈ నివేదిక పేర్కొంది. గతంలో కరోనా హాట్‌స్పాట్స్‌గా పేరొందిన ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కేసుల తగ్గుదల నేపథ్యంలో ఐఓఆర్ తాజా అంచనాలపై ఆశలు రేకెత్తిస్తున్నాయి.
నవంబర్ నాటికి ముంబై నగరం కరోనా నుంచి బయటపడుతుందని భావిస్తున్నారు. కరోనా బారినపడిన మరో నగరం చెన్నై సైతం అక్టోబర్ చివరినాటికి మహమ్మారి నుంచి కోలుకుంటుందని నివేదిక పేర్కొంది. నవంబర్ తొలివారం నుంచి దేశ రాజధాని ఢిల్లీ కరోనా రహితమవుతుందని అంచనా వేసింది. ఇక ఆగస్ట్ మాసాంతానికి బెంగళూర్‌లో ముమ్మర దశకు చేరకునే కరోనా వైరస్ నవంబర్ మధ్యలో ఐటీ సీటీని విడిచిపెడుతుందని పేర్కొంది. కోవిడ్-19 కేసులు పెద్ద నగరాల నుంచి నిలకడగా తగ్గుతుండటంతో చిన్న, మధ్యశ్రేణి నగరాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని నివేదిక తెలిపింది.
ఆగస్ట్‌లో ఇండోర్, థానే, సూరత్, జైపూర్, నాసిక్, తిరువనంతపురం వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కేసులు పెరుగుతున్నాయని, నవంబర్ ద్వితీయార్ధంలో ఈ నగరాల్లో మహమ్మారి వ్యాప్తికి బ్రేక్‌పడుతుందని నివేదిక అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే రేటు (ఆర్‌ఓ)లో కూడా గణనీయంగా తగ్గుదల చోటుచేసుకుంటోంది. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ మహారాష్ట్రలో ఆర్‌ఓ 1.24కు తగ్గడం మహమ్మారి బలహీనపడిందనే సంకేతాలు పంపుతోంది. తెలంగాణలోనూ ఇవే గణాంకాలు నమోదవడం ఊరట ఇస్తోంది.