Second Wave: అత్యంత ప్రమాదకరంగా సెకండ్‌ వేవ్‌

Second Wave: భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం * లక్షల్లో రోజువారీ కేసులు.. వేలల్లో మరణాలు

Update: 2021-04-22 03:05 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Second Wave: భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి అత్యంత ప్రమాదరకంగా మారింది. దేశంలో రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు భారత్‌ నుంచి వైరస్‌ను తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు నడుం బిగించాయి. వయస్సును బట్టి విడతల వారీగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేశాయి. చివరి విడతలో భాగంగా 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సున్నవారికి మే 1 నుంచి వ్యాక్సిన్లు అందజేయనున్నారు.

అయితే.. వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా కొవిడ్‌ బారిన పడుతుండడంతో ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. టీకా వేసుకున్నాక కూడా కరోనా వస్తుండడంతో ఇక వ్యాక్సిన్‌ వేయించుకుని లాభమేంటన్న భావన ప్రజల్లో నెలకొంటోంది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా  వ్యాక్సిన్‌ వేసుకోకుండా ఉండేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాన్ని, అనుమానాలను పటాపంచెలు చేసేందుకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనాను అంతమొందిచాలంటే ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాల్సిందేనని తెగేసి చెప్పింది. దీనికి సంబంధించిన సంచలన డేటాను విడుదల చేసింది ఐసీఎంఆర్‌.

ఇప్పటివరకు రెండు డోసుల టీకా తీసుకున్నవారిలో తక్కువ మందే వైరస్‌ బారిన పడుతున్నారని కేంద్రం ప్రకటించింది. 10 వేల మంది వ్యాక్సిన్‌ తీసుకుంటే వారిలో ఇద్దరు నుంచి నలుగురికి మాత్రమే మరోసారి కొవిడ్‌ సోకుతోందని ఈ డేటా చెబుతోంది. ఒకవేళ కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినప్పటికీ తీవ్రమైన అనారోగ్యం బారిన పడడం లేదని స్పష్టం చేసింది ఐసీఎంఆర్‌. ఈ డేటా ప్రకారం.. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను ఇప్పటివరకు కోటి 10 లక్షల మంది తీసుకున్నారు. ఇందులో 93 లక్షల మంది మొదటి డోసు వేసుకోగా 17 లక్షల మంది రెండు డోసులూ స్వీకరించారు. అయితే.. మొదటి డోసు తీసుకున్నవారిలో 4 వేల 208 మంది కొవిడ్‌ బారిన పడగా రెండో డోసు తీసుకున్న వారిలో కేవలం 695 మందికి మాత్రమే కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. అంటే రెండు డోసులు తీసుకున్నవారిలో కొవిడ్‌ బారిన పడుతున్నవారు 0.04 శాతం మాత్రమేనని ఐసీఎంఆర్‌ క్లారిటీ ఇచ్చింది.

ఇక కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కూడా స్వల్పంగానే కొవిడ్‌ బారిన పడుతున్నట్టు డేటా ప్రకారం వెల్లడవుతోంది. ఇప్పటివరకు ఈ టీకాను 11 కోట్ల 6 లక్షల మంది తీసుకోగా తొలి డోసు తీసుకున్న 10 కోట్ల మందిలో 17వేల 145 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అలాగే రెండు డోసులూ తీసుకున్న కోటిన్నర మందిలో కేవలం 5వేల 14 మంది మాత్రమే కొవిడ్‌ బారిన పడినట్లు స్పష్టమవుతోంది. దీని ప్రకారం కొవిషీల్డ్‌ రెండు డోసులూ తీసుకున్న మొత్తం జనాభాలో 0.03 శాతం మంది మాత్రమే కొవిడ్‌ బారిన పడుతున్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. 

Tags:    

Similar News