Coronavirus: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌..?

Coronavirus: దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా కేసులు * దేశంలోని ఆరు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం

Update: 2021-03-13 05:38 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Coronavirus: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనికి కారణం ప్రజలు కనీస నిబంధనలు కూడా పాటించకపోవడమేనని తెలుస్తోంది. ఈ కారణంగా కొవిడ్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.గత వారం రోజులుగా నమోదైనటువంటి కేసుల సంఖ్య చూస్తే భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైందనే చెప్పాలి. ఫిబ్రవరి 11న 10 వేల కేసులు నమోదవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలు దాటేసింది. అంటే నెల రోజుల వ్యవధిలోనే రెండురెట్లు అధికంగా కేసులు రికార్డయ్యాయి.

ఫిబ్రవరి మొదటి వారంలో నెమ్మదిగా పెరిగిన పాజిటివ్‌ కేసులు.. మార్చి నాటికి విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడు రోజుల సగటు చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ కేసులు పంజాబ్‌లో రికార్డయ్యాయి. ఇక ఢిల్లీలోనూ కొత్తగా 409 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రెండు నెలల తర్వాత ఒకే రోజున ఇంత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

దేశంలోని ఆరు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, కేరళలో పరిస్థితి అదుపు దాటింది. ఈ ఆరు రాష్ట్రాల్లోనే 85శాతం కేసులు నమోదవుతున్నాయి. గత జనవరిలో రోజుకు సగటున 181 కేసుల చొప్పున పంజాబ్‌లో రికార్డవ్వగా ఇప్పుడు ఆ సంఖ్య వేలకు చేరుకుంది. మరోవైపు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోనూ మహమ్మారి ప్రభావం ఎక్కువవుతోంది.

నిన్న దేశవ్యాప్తంగా 22 వేల 854 మందికి కరోనా నిర్ధారణ అయింది. 77 రోజుల ముందు డిసెంబరు 25న 23 వేల 67 కేసులు వచ్చాయి. ఆ తర్వాత ఈ రేంజ్‌లో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. కొత్త కేసుల్లో 13 వేల 659 కేసులు మహారాష్ట్రవే. దేశంలో యాక్టివ్‌ కేసులు అధికంగా ఉన్న పది జిల్లాల్లో 8 మహారాష్ట్రలోనివే. దీంతో మహారాష్ట్రలోని 3 జిల్లాల్లో మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటించింది ప్రభుత్వం.

భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణకు చిన్న నిర్లక్ష్యం కారణమవుతుందనే చెప్పాలి. ప్రజల్లో కరోనా అన్న భయమే పోయింది. అందుకు కారణం వ్యాక్సిన్లు వచ్చేశాయన్న భరోసా కావొచ్చు. మరోవైపు మాస్కులు పెట్టుకోవట్లేదు. సోషల్​డిస్టెన్స్ పాటించడం లేదు. ఎక్కడికక్కడ జనాలు గుమిగూడుతున్నారు. ఆడంబరంగా ఫంక్షన్లు జరుపుకుంటున్నారు. ఇవి సరిపోవు అన్నట్టు ఎన్నికలు. దీంతో కరోనా విస్తరణ జోరందుకుంది.

ఇటు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాప్తి స్పీడ్‌ అందుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో.. వారం, పది రోజులుగా తెలంగాణలోనూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెలంగాణకు నిత్యం రాకపోకలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి అంతర్గత విమానాల నుంచి ప్రయాణికులు వస్తూపోతుండటం, కాలేజీలు, స్కూళ్లు, సినిమా హాళ్లు, హోటళ్లు తెరిచి ఉండటం, బ్రిటన్‌ స్ట్రెయిన్లు, ఇక్కడి కొత్త స్ట్రెయిన్లు చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో సెకండ్‌ వేవ్‌పై అనుమానాలు మొదలయ్యాయి.

తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రోజుకు కనీసం 50 వేల పరీక్షలు చేయాలని ఆదేశించింది. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలుంటే పరీక్షలు చేసుకోవాలని, యాంటీజెన్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చి, లక్షణాలున్న వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఈటల రాజేందర్‌. కేసులు పెరిగితే అన్ని ఆస్పత్రుల్లో చికిత్సల కోసం వార్డులను సిద్ధంగా ఉంచాలని కోరారు. అలాగే 102, 104, 108 వాహనాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని సూచించారు.

అటు ఏపీని కూడా కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. ఏపీలో తొలి కరోనా కేసు నమోదై ఏడాది పూర్తి అయ్యింది. ఏపీలో గత ఏడాది మార్చి 12న తొలి కేసు అధికారికంగా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆ మహమ్మారి రాష్ట్రాన్ని గజగజా వణికిస్తూనే ఉంది. కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పుడు మరోసారి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏపీ వ్యాప్తంగా జోరుగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం సాగుతున్నప్పటికీ.. మళ్లీ వైరస్ విస్తరిస్తుండడం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది.

Full View


Tags:    

Similar News