Coronavirus Patients are Getting Big Medical Bills for Hospital : లక్షలాది మందికి ఆసుపత్రుల్లో చికిత్స సాధ్యమేనా ?
Coronavirus patients are getting big medical bills for hospital : దేశంలో రోజుకు కొత్తగా పాతిక వేల దాకా కేసులు నమోదవుతున్నాయి. ఈ శీతాకాలం చివరి నాటికి దేశంలో రోజుకు సుమారుగా 3 లక్షల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేసిన ఈ హెచ్చరిక ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలో ఇన్ని లక్షల మందికి చికిత్స చేసేందుకు వసతులు ఉన్నాయా అన్నదే కీలకంగా మారింది.
భారత్ లో ఇప్పటి వరకూ సుమారు ఏడున్నర లక్షల దాకా కరోనా కేసులు నమోదయ్యాయి. సుమారు 21 వేల మంది మరణించారు. నాలుగు లక్షల 95 వేల మంది కోలుకున్నారు. సుమారు 2 లక్షల 76 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇంత మందికి చికిత్స అందించడం ఎలా అన్నదే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అంతకు మించిన అంశం మరొకటి కూడా ఉంది. అదే హాస్పిటల్ బిల్లింగ్. లక్షల్లో వస్తున్న బిల్లులను చూసి బాధితులు హడలిపోతున్నారు.
కరోనా టెస్టుల పేరిట ప్రైవేటు ల్యాబ్ లు, చికిత్స పేరిట ప్రైవేటు ఆసుపత్రులు భారీగా బిల్లులు వసూలు చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వాలు ముందుగానే ఊహించాయి. అందుకే చాలా రోజుల పాటు కరోనా టెస్ట్ లకు ప్రైవేటు ల్యాబ్ లను దూరంగానే ఉంచాయి. కరోనా విస్తరిస్తున్న తీరును గుర్తించి క్రమంగా ప్రైవేటు ల్యాబ్ లకు టెస్టింగ్ లకు అనుమతించాయి. ప్రైవేటు రంగంలో చికిత్స విషయంలోనూ అదే విధంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేసింది. అదే సందర్భంలో టెస్టింగ్, చికిత్స బిల్లింగ్ విషయంలో మార్గదర్శకాలను కూడా నిర్దేశించింది.