Oxygen shortage: తర్వాత పరిస్థితి ఊహించలేమని హెచ్చరిస్తున్న వైద్యులు
Coronavirus: ఢిల్లీలో కరోనా రోగుల ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి. ఆక్సిజన్ కొరతతో ఢిల్లీ ఆగమవుతోంది.
Coronavirus: ఢిల్లీలో కరోనా రోగుల ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి. ఆక్సిజన్ కొరతతో ఢిల్లీ ఆగమవుతోంది. ఏ ఆసుపత్రికి వెళ్లినా ప్రాణవాయువు దొరకడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఖాళీ సిలెండర్లే దర్శనమిస్తున్నాయి. ఊపిరాడని పేషెంట్లు ఆక్సిజన్ కోసం వెంపర్లాడుతున్నారు. సరిపడా ఆక్సిజన్ లేక డాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో కరోనా పేషెంట్లు ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు.
దేశరాజధాని ఢిల్లీని కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిండుకుంటున్న ఆక్సిజన్ నిల్వలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. గంట గడిస్తే చాలు రోగుల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు ఆక్సిజన్ కోసం వెంపర్లాడే రోగులు పుట్టుగొడుగుల్లా పుట్టుకస్తున్నారు. ఆక్సిజన్ నిల్వలేమో నిండుకుంటున్నాయి. దీంతో ప్రాణవాయువు కోసం రోగులు విలవిలాడుతున్నారు. బయట బంధువులు ఆక్సిజన్ సిలెండర్ల కోసం పడరాని పాట్లు పాడుతున్నారు. దీంతో కరోనా రోగులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
బతుకుపై ఆశతోనే రోగులు ఆస్పత్రులకు వస్తుంటారు. కానీ ఢిల్లీలోని ఆసుపత్రులు ఆ ఆశను చంపేస్తున్నాయి. రోగుల నమ్మకాలను పాతర వేస్తున్నాయి. అందుకే ఢిల్లీ ఆసుపత్రుల్లో అడ్మిట్ కావడానికి జనాలు జడుసుకుంటున్నారు. ఎప్పుడు ఆక్సిజన్ లేదంటారో అని భయపడిపోతున్నారు. వందలాదిగా పేషంట్లు బెడ్లపై ఊపిరి కోసం అల్లాడుతున్నారు. కానీ పట్టుమని పది గంటలు సరిపడే ఆక్సిజన్ ఇవ్వలేకపోతున్నాయి ఢిల్లీలోని ఆసుపత్రులు. చిన్నాపెద్ద అన్న తేడా లేదు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా ఇదే దుస్థితి. ఆక్సిజన్ దొరకదు ప్రాణం నిలవదు.
సంజయ్ గాంధీ హాస్పిటల్‌లో కేవలం 2 గంటలకు సరిపడా ఆక్సిజన్ స్టాక్ ఉంది. బాత్రా హాస్పిటల్ లో 9 గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉంది. హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో 9 గంటలు, రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లో 10 గంటలు, లోక్‌నాయక్ హాస్పిటల్‌లో 12 గంటలు, మాక్స్ హాస్పిటల్‌లో 20 గంటలు, దీన్‌దయాళ్ హాస్పిటల్, అంబేద్కర్ నగర్ హాస్పిటల్‌లో 24 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి. అయితే ఈ నిల్వలు కేవలం ఒకటి రెండు రోజులకే సరిపోతాయని వైద్యులు అంటున్నారు. ఆ తర్వాత పరిస్థితిని ఊహించలేమని వైద్యులు చేతులు ఎత్తేస్తున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం కావాలనే ఢిల్లీకి ఆక్సిజన్ కొరత సృష్టిస్తుందని సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీకి కేటాయించాల్సిన 140 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా పునరుద్ధరించి, ఆక్సిజన్ నిల్వలను పంపించాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు సీఎం లేఖ రాశారు.
గంగారామ్ హాస్పిటల్‌కు 14వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్‌ను కేంద్రం పంపించింది. కానీ అది కేవలం రెండు రోజలకే సరిపోతుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇక జీటీబీ హాస్పిటల్‌లో మరీ దారుణం కొత్తగా మరో 500 వందల మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అత్యవసరమైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుందని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి.