JEE and NEET Exams: నీట్‌, జేఈఈ పరీక్షలు వాయిదా!

JEE and NEET Exams: అంతా అనుకునట్టుగానే జరిగింది.

Update: 2020-07-03 15:46 GMT

JEE and NEET Exams: అంతా అనుకునట్టుగానే జరిగింది. కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టుగా హెచ్చార్డీ మంత్రి రమేష్‌ పోక్రియాల్‌ వెల్లడించారు. ఇక తిరిగి సెప్టెంబర్‌ 1 నుంచి 6వ తేదీ మధ్య జేఈఈ మెయిన్స్‌, సెప్టెంబర్‌ 13న నీట్‌ పరీక్ష నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు.

అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను సెప్టెంబర్‌ 27న నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇక చాలా విద్యాసంస్థలు క్వారెంటైన్ సెంటర్లు మారిన నేపధ్యంలో విద్యార్దులు పరీక్షలు రాసే పరిస్థితి లేదని అయన అన్నారు. వాస్తవానికి అయితే ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం అయితే జేఈఈ పరీక్ష జూలై 19-23 వరకు, నీట్ పరీక్ష జూలై 26న జరగాల్సి ఉంది. ఇక అటు దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు దాదాపుగా 9 లక్షల మంది, నీట్‌కు సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపధ్యంలో ఇప్పటికే చాలా పరీక్షలు వాయిదా లేదా రద్దు అయిన సంగతి తెలిసిందే!

ఇక దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 20,903 కేసులు నమోదు కాగా, 379 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 6,25,544 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,27,439 ఉండగా, 3,79,891 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 18,213 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,41,576 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 92,97,749 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. 

Tags:    

Similar News