N95 Mask: ఇంట్లో ఉన్నా ఎన్95 మాస్కులు ధరించాల్సిందే!
N95 Mask: లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన అనంతరం దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
N95 Mask: లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన అనంతరం దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వస్తున్నాయి. మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తోందనే వార్తలు ఇప్పుడు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది. త్వరలోనే ఒకటి, రెండు స్థానాలకు చేరేలా కూడా కనిపిస్తోంది. అయితే రికవరీ రేటు 60శాతానికి పైగా నమోదవ్వడం కొంచం హర్షించ తగ్గ విషయంగా చెప్పుకోవచ్చు..
అటు ఈ వైరస్ కి వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు ఎంతో శ్రమిస్తున్నాయి. ఇప్పటికే మనుషుల పైన ప్రయోగాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంత కాలంలో వాక్సిన్ వస్తుందనే విషయాలపై పలువురు ప్రముఖులు నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకి కూడా లేఖ రాశారు. అయితే దీనిపైన శాస్త్రీయమైన నిర్ధారణ లేకపోవడంతో డబ్ల్యూహెచ్‌వో దానిని కొట్టిపారేసింది. అయితే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇంట్లో ఉన్న వారు దూరం దూరంగా ఉంటూ ఎన్-95 మాస్కులు ధరించాలని అంటున్నారు. లాక్‌డౌన్ లేకున్నా సరే ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు.
ఇక అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 22,771 కేసులు నమోదు కాగా, 467 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 7,19,665 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,59,557 ఉండగా, 4,39,947 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 20,160 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,41,430 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,02,11,092 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.