Coronavirus New strain: బ్రిటన్‌లో కరోనా న్యూ స్ట్రెయిన్ ప్రమాద ఘంటికలు
Coronavirus New strain: * 70శాతం వేగంతో పాజిటివ్ కేసులు నమోదు * ఫిబ్రవరి వరకు లాక్‌డౌన్ విధించిన బ్రిటన్ ప్రభుత్వం * ఇంగ్లండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో కఠిన ఆంక్షలు
బ్రిటన్‌లో కరోనా న్యూ స్ట్రెయిన్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 70శాతం వేగంతో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రోజురోజుకు కేసులు పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. ఇక అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటకు రావొద్దన్నారు ప్రధాని బోరిస్ జాన్సన్. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ తర్వాత పరిస్థితుల్ని బట్టి ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం లేనివారు నిత్యావసరాలు, వైద్య అవసరాల కోసం, కరోనా టెస్ట్ చేయించుకోవడానికి బయటకు రావచ్చొని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా గతయేడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్ నిబంధనలన్నీ ఇప్పుడు కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంగ్లండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో ఈ రోజు నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి స్కాట్‌లాండ్‌లో నెలకొన్న అత్యవసర పరిస్థితి దృష్ట్యా నిన్నటి నుంచే లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది.
కాగా యూకేలో వరుసగా ఏడోరోజూ 50వేలకుపైనే కేసులు బయటపడ్డాయి. నిన్నఒక్కరోజే 60వేల 916 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు యూకే వ్యాప్తంగా 27లక్షలకుపైగా కేసులు నమోదైతతే.. 76వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇంగ్లండ్‌లో కొన్ని ఆస్పత్రుల్లో ప్రతీ 10 పడకల్లో ఆరింట్లో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు బ్రిటన్ ప్రభుత్వం కరోనా కట్టడికి టీకాపైనే ఆశలు పెట్టుకుంది. అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. ప్రజలకి ఫైజర్, కోవిషీల్డ్ రెండు టీకాలు ఇస్తున్నారు.
ఇక బ్రిటన్‌లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ భారత్, అమెరికా తదితర దేశాలకు వ్యాప్తి చెందింది. ఈ క్రమంలో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు తప్పనిసరిగా కోవిడ్-19 టెస్టును చేయాలని నిర్ణయం తీసుకుంది.
జర్మనీలోనూ 24 గంటల్లో 944మంది కరోనాతో చనిపోడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో కఠిన లాక్‌డౌన్‌ను ఈనెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. ఇక బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగించారు.
కరోనాకు పుట్టినిళ్లైన చైనాలోనూ కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బీజింగ్ సమీపంలోని హెబీ ప్రావిన్స్‌లో 14కేసులు బయట పడటంతో ఆప్రాంతాన్ని ప్రభుత్వం డేంజర్ జోన్‌గా ప్రకటించింది. కొత్త కేసుల్లో 11 షిజిజువాంగ్ నగరంలోనే ఉన్నాయి. లక్షణాలు కనిపించకుండా మరో 30 కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.