కోవిడ్ పై పోరులో మరో ముందడుగు.. కేవలం 500 తో కరోనా నిర్ధారించే పరికరం రెడీ!
coronavirus: ఐఐటీ ఖరగ్ పూర్ తక్కువ ఖర్చుతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే పరికరాన్ని సిద్ధం చేశారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు పరిశోధకులు. ఒక పక్క సాధారణ జనజీవనానికి మార్గాన్ని సుగమం చేస్తున్న ప్రభుత్వం మరో పక్క కరోనా పై పోరుకు కొత్త మార్గాల అన్వేషణ పై దృష్టి పెట్టేలా పరిశోధనలకు ఊతం ఇస్తోంది. ఈ క్రమంలో ఐఐటీ, ఖరగ్ పూర్ పరిశోధకులు మరో ముందడుగు వేశారు.
ఇంత వరకూ కరోనా వ్యాధి నిర్ధారణ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇకపై ఇది తేలిక కానుంది. నిజానికి కరోనా పరీక్షలకు ఉపయోగించే పరికరాలే అతి ఖరీదైనవి. పైగా వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటి వరకూ. కానీ, ఇప్పుడు మరి కొన్ని రోజుల్లో ఈ ఇబ్బందుల్ని భారతదేశం అధిగామించబోతోంది. ఈ మేరకు ఐఐటీ ఖరగ్ పూర్ పరిశోధకులు చౌకలో కరోనా పరీక్షలు పూర్తి చేయగలిగే విధానాన్ని రూపొందిచారు. ఈ పరికరంతో కేవలం ఐదు వందల రూపాయలకే కోవిడ్ పరీక్షను పూర్తి చేయవచ్చు. ఈ పరికరానికి కోవిరాప్ అని పేరుపెట్టారు. అంతే కాదు ఈ పరికరం ఖరీదు కేవలం పదివేల రూపాయలు మాత్రమె ఉంటుంది.
కేవలం గంట వ్యవధిలోనే ఈ కోవీరాప్ పరికరం ద్వారా కరోనా పరీక్ష ఫలితాలు పొందవచ్చు. అంటే తక్కువ ఖర్చుతో.. తక్కువ సమయంలోనే కరోనా నిర్ధారణ పరీక్ష పూర్తి చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ విధనాన్ని ఐఐటీ ఖరగ్ పూర్ ప్రొఫెసర్లు సుమన్ చక్రబర్తి, డాక్టర్ అరిందమ్ మొండెల్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ విధానాన్ని కనుగొన్నారు.ఇప్పటికే ఈ పరికరానికి ఐసీఎంఆర్ అనుమతి కూడా ఇచ్చేసింది. ఇక దీనికి పేటెంట్ హక్కులు రావడమే ఆలస్యం. పేటెంట్ హక్కులు వస్తే భారీ ఎత్తున ఈ పరికరం ఉత్పత్తి చేయడానికి మార్గం సుగమం అవుతుంది అని ఐఐటీ ఖరగ్‌పూర్ డైరక్టర్ వీకే తివారీ పేర్కొన్నారు. ఈ పరికరాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి వివిధ సంస్థలతో చేతులు కలిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అయన ప్రకటించారు.
మరోవైపు ఈ పరికరాన్ని కనుగొన్న ఐఐటీ ఖరగ్‌పూర్ బృందాన్ని కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కొనియాడారు. 'ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఐఐటీ, ఖరగ్‌పూర్ విద్యార్థుల వైద్య ఆవిష్కరణ ప్రశంసనీయం. కనీస శిక్షణతో గ్రామీణ యువత కూడా ఈ పరికరాన్ని తేలిగ్గా ఉపయోగించగలదు. దీనికయ్యే వ్యయం కూడా చాలా తక్కువ. ఎక్కడికైనా సులభంగా తరలించడానికి అనువుగా ఉన్న ఈ పరికరం అనేక మంది గ్రామీణ ప్రజల ప్రాణాలు నిలబెడుతుంది' అని ఆయన అన్నారు.