Coronavirus: దేశంలో మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా

Coronavirus: ప్రపంచపు రోజువారీ పాజిటివ్‌లలో రెండో స్థానం * బ్రెజిల్‌, అమెరికాను మించి రోజువారీ కేసులు

Update: 2021-04-05 04:17 GMT
ఫైల్ ఫోటో 

Coronavirus: భయం వీడడం లేదు. ఇంకా వణికిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ గడగడలాడిస్తోంది. గత ఏడాది అతలాకుతలం చేసిన వైరస్... ఇప్పుడు మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మహారాష్ట్రలో మొదలైన సెకండ్‌ వేవ్‌ దేశమంతా కమ్ముకుంటోంది. నిన్నమొన్నటివరకూ నిత్యం జనంతో నిండివున్న నగరాలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. మహా నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకూ ఏదో తెలియని భయంతో నిశబ్దం అలముకుంటోంది. కాస్త తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా మహమ్మారి.. రోజురోజుకు మళ్లీ తీవ్రరూపం దాల్చుతుంది. రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాలు పెరుగుతుండడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో కరోనా రెండో దశ ఉధృతంగా ఉంది. నెల రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్న వైరస్‌ వ్యాప్తి.. తీవ్ర స్థాయికి చేరుతోంది. వరుసగా రెండో రోజు ప్రపంచంలో అత్యధిక కేసులు భారత్‌లోనే నమోదయ్యాయి. కరోనా తీవ్రంగా ఉన్న బ్రెజిల్‌, అమెరికాల్లో కొత్త కేసులు 70 వేలకు దిగువనే ఉన్నాయి. బ్రెజిల్‌లో క్రితం వారంతో పోలిస్తే కేసులు ఒక శాతం వరకు తగ్గాయి. అమెరికాలో ఒక శాతం పెరిగాయి. భారత్‌లో మాత్రం భారీగా పెరుగుదల నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో 2020 జనవరి 30న కరోనా తొలి కేసు నమోదైంది. అదే ఏడాది సెప్టెంబరు 15న రికార్డు స్థాయిలో 97,984 పాజిటివ్‌లు వచ్చాయి. దీని ప్రకారం కరోనా తొలి దశ ఉధృత స్థాయికి చేరేందుకు 8 నెలల 15 రోజులు పట్టింది. రెండో దశ ఊహకందనంతగా విరుచుకుపడుతోంది. దేశంలో వరుసగా 25వ రోజు పాజిటివ్‌ల పెరుగుదలతో యాక్టివ్‌ కేసులు 6.91 లక్షలకు చేరాయి. రికవరీ రేటు 93.14కు పడిపోయింది. కాగా, కరోనా ఉధృతి పెరుగుతుండటంతో మహారాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఇది అమల్లోకి రానుంది.

కరోనా మహమ్మారి పట్ల అంతటా నెలకొన్న నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారితీస్తోందా? అంటే అవుననే గణాంకాలు చెబుతున్నాయి. వేగంగా వ్యాపిస్తున్న సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కోవాలంటే.. సరికొత్త వ్యూహాలు అవసరమని నిపుణులు అంటున్నారు. కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని, మరికొంత కాలం పరిస్థితి ఇలాగే కొనసాగిందంటే.. ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరిగిపోతుందని హెచ్చరించారు. కేసుల సంఖ్యను నియంత్రించే దిశగా వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందటున్నారు.

Full View


Tags:    

Similar News