Coronavirus: భారత్‌లో కరోనా ఉగ్రరూపం

Coronavirus: రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు * గడిచిన 24గంటల్లో 93,249 మందికి కరోనా పాజిటివ్‌

Update: 2021-04-04 05:11 GMT

కరోన (ఫైల్ ఇమేజ్)

Coronavirus: భారత్‌లో కరోనా ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఒక వైపు వ్యాక్సినేషన్‌ జరుగుతుంటే... మరోవైపు రెండో దశ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 93వేల 249 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నిన్నటితో పోలిస్తే కొవిడ్‌ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదు కాగా, మరణాలు కొంతమేర తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య కోటి 24లక్షల 85వేల 509కి చేరింది.

ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 714 నమోదు కాగా.. శనివారం ఆ సంఖ్య కొంత తగ్గింది. మొత్తం 513 మంది కరోనాతో మరణించారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1లక్షల 64వేల 623కు పెరిగింది. ఇక మరణాల రేటు 1.32 శాతానికి చేరింది.

మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. శనివారం ఒక్కరోజే దాదాపు 49వేల 447 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 277మరణాలు నమోదు కాగా, 37వేల 821 మంది డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 29.53 లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక కర్ణాటకలో గడిచిన 24 గంటల్లో దాదాపు ఐదు వేల కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌‌ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 27.38లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 7కోట్ల 59లక్షల 79వేల 651కి చేరింది.

Full View


Tags:    

Similar News