ఇండియాను టెన్షన్ పెడుతోన్న కరోనా కొత్త స్ట్రెయిన్
25కు చేరిన కొత్త స్ట్రెయిన్ బాధితుల సంఖ్య
ఇండియాలో కొత్త స్ట్రెయిన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయ్. 25కు చేరింది ఆ నంబర్ ఇప్పుడు ! దీంతో ఏం జరగబోతుందన్న టెన్షన్ మరింతగా కనిపిస్తోంది జనాల్లో ! అసలే న్యూ ఇయర్ వేడుకలు.. ఆ తర్వాత సంక్రాంతి.. ఇలాంటి లెక్కలేసుకొని ఆందోళన చెందుతున్నారు.
ఒకటి అయిందనుకునేలోపు ఇంకొకటి.. కరోనా వెయ్యి తలలతో రెచ్చిపోతుందనిపిస్తోంది సీన్ చూస్తుంటే ! గతేడాది నవంబర్‌లో పుట్టుకొచ్చిన కరోనాతో పోలిస్తే 70శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కొత్త స్ట్రెయిన్ ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తోందిప్పుడు! యూకేలో ఈ మహమ్మారి మొదటగా కనిపించగా...భారత్ సహా అనేక దేశాలు ఇప్పటికే అప్రమత్తమై బ్రిటన్‌కు రాకపోకలను నిలిపివేశాయి. ఐతే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే.. యూకే నుంచి దాదాపు 33వేల మంది ప్రయాణికులు ఇండియాకు వచ్చారు. అందులో 120మందికి పైగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 25మందిలో కొత్తరకం స్ట్రెయిన్ జాడలు ఉన్నట్లు గుర్తించారు.
మరోవైపు కొత్తరకం కరోనా వైరస్... బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో విజృంభిస్తోంది. అక్కడ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త స్ట్రెయిన్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో భారత్ మరింతగా అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్ని గుర్తించేందుకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. యూకే నుంచి వచ్చిన వారెవరు? ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో తెలుసుకొని గుర్తించేందుకు రాష్ట్రాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయ్. కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణకు 11వందల మందికి పైగా యూకే నుంచి రాగా.. వారిలో దాదాపు 275మంది ఎక్కడున్నారో గుర్తించాల్సి ఉంది. పంజాబ్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు కూడా యూకే నుంచి వచ్చినవారిని గుర్తించడం కష్టమంటున్నారు. ఏపీకి 14వందల 23మంది రాగా.. వారిలో 14వందల 6మందిని గుర్తించారు. మిగతా వారిని ఇంకా ఐడెంటిఫై చేయాలి. ఐతే కొత్త స్ట్రెయిన్‌కు వ్యాప్తి ఎక్కువగా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అటు ఇలాంటి వేరియంట్‌పై వ్యాక్సిన్లు పనిచేయవు అనడానికి ఆధారాలు లేవని సైంటిస్టులు చెప్తున్నారు.